హాజీపూర్, మే 12 : రైతులు, ప్రభుత్వానికి జిల్లాలోని రైస్ మిల్లర్లు సహకరించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీ ప్రకారం రైస్ మిల్లర్లు యాసంగి వడ్లను కొనాలన్నారు. రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీ వేశారని వెల్లడించారు. సమావేశం నుంచి రైస్ మిల్లర్ల సమస్యలపై మంత్రి గంగుల కమలాకర్‌తో ఫోన్లో మాట్లాడి చర్చించారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నాయని దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉన్నదని, రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేదీ లేదన్నారు. విప్ లేవనెత్తిన అంశాలపై రైస్ మిల్లర్ల యజమానులు సానుకూలంగా స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, మే 12, రాష్ట్రంలోని పురపాలక సంఘాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలతో కృషి చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డుల్లో రూ.14.61 కోట్లతో బతుకమ్మ ఘాట్లు, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్కులు, తదితర 49 అభివృద్ధి పనులకు గురువారం భూమి పూజ చేశారు. మున్సిపాలిటీలోని వార్డుల్లో స్థానిక మున్సిపల్ పాలక మండలి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ద్విచక్రవాహనంపై కలియ తిరిగారు.
పలు వార్డులో మహిళలు మంగళ హారతులతో విప్ సుమన్‌కు స్వాగతం పలికారు. మున్సిపాలిటీ 10వ వార్డులో 1.42 కోట్లతో క్యాతనపల్లి (కుర్మపల్లి) ఊర చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులకు భూమిపూజ చేశారు. పట్టణ ప్రజల చిరకాల స్వప్పం సుమారు రూ.30 కోట్లతో చేపట్టిన రైల్వే ఆర్వోబీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 22 వార్డులోని ఫ్రొఫేసర్ జయశంకర్ సార్ చౌక్‌లో రూ.16.70 లక్షలతో ట్రీ పార్క్, బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రామకృష్ణాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
11వ వార్డులో రూ.55 లక్షలతో బతుకమ్మ గ్రౌండ్, పార్కు పనులు, 12వ వార్డులో బతుకమ్మ గ్రౌండ్ పనులకు భూమి పూజ చేశారు. రూ.15.15 కోట్ల నిధులతో నిర్మితమైన 286 డబుల్ బెడ్రూం ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 13వ వార్డులో రూ.33 లక్షలతో బతుకమ్మ గ్రౌండ్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ఆటస్థలం, ట్రీ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మాణమవుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించారు. 1వ వార్డులో రూ.1.10 కోట్లతో కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవన నిర్మాణం, బతుకమ్మ గ్రౌండ్, పిల్లల ఆటస్థలం, 2వ. వార్డులో 5.18 కోట్లతో కాలువ నిర్మాణం, అంబేద్కర్ ఎకో పార్కు నిర్మాణం, బతుకమ్మ గౌండ్, స్లాటర్ హౌస్ పనులు, 14వ వార్డులో 1.05 కోట్ల కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, 17వ వార్డులో రూ.74 లక్షలతో ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలం నిర్మాణం, బతుకమ్మ గ్రౌండ్, 15వ వార్డులో బతుకమ్మ గ్రౌండ్, 6వ వార్డులో రూ.10 లక్షలతో చిల్డ్రన్స్ ఆటస్థలం, 21వ వార్డులో రూ.1.89 కోట్లతో మహిళా భవన్, ఓపెన్ జిమ్, 20వ వార్డులో రూ.1.50 కోట్లతో కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవన్, పబ్లిక్ టాయిలెట్స్, బతుకమ్మ గ్రౌండ్, 19వ వార్డులో రూ.10 లక్షలతో పిల్లల ఆటస్థలం, 3వ, 4వ వార్డుల్లో రూ.49 లక్షలతో బతుకమ్మ గ్రౌండ్స్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలం ట్రీ పార్క్ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ వెంకటనారయణ, ఏఈ అచ్యుత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, బోయినపెల్లి నర్సింగరావు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.