“ఎమ్మెల్యేలను కోరుతున్నా. ప్రతి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేద్దాం. మీకు కావాల్సిన సామగ్రి, విషయ పరిజ్ఞానమున్న ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రుచికరమైన భోజనంతోపాటు అన్ని వసతులు కల్పించి ఉద్యోగార్థులకు శిక్షణ ఇప్పిద్దాం. పేద కుటుంబాల అభ్యర్థులకు అండగా నిలుద్దాం.”
– అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఒక్కొక్కటిగా జాబ్స్‌కు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్-1తోపాటు పోలీసుశాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలు, టెట్ వంటి వాటికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో గ్రూప్-2,3,4లతోపాటు పలు శాఖలకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే వీటన్నింటికీ వందల సంఖ్యలో ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోనున్నారు.
ఊపింది. ఏకంగా 80,039 పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు, ఫైర్, రవాణా శాఖల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ విడుదల కాగా.. ఆన్లైన్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ఐటీ, మున్సిపల్ శాఖ అమాత్యుడు కేటీఆర్ సూచన మేరకు కొలువులు సాధించాలనే ఉద్యోగార్థులకు మంత్రి, విప్, ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. తమ నియోజకవర్గ కేంద్రాల్లో ఉచిత శిక్షణతోపాటు పుష్టికరమైన భోజనం, సకల వసతులు కల్పిస్తూ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, చెన్నూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్లో ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్కారు కొలువులు సాధించాలనే ఉత్సాహంతో యువత పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
నిర్మల్, మే 9(నమస్తే తెలంగాణ) : నిర్మల్ పట్టణంలో అల్లోల చిన్నమ్మ-నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సెలెక్షన్స్ కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా యువతీ యువకులకు రాత, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి 250 మందిని ఎంపిక చేశారు. వీరికి ప్రతిరోజూ జిల్లా కేంద్రంలోని చాణక్య డిగ్రీ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులతో ఆయా సబ్జెక్టులపై కోచింగ్ ఇస్తున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జియోగ్రఫీ, అర్ధమెటిక్, రీజనింగ్, చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లిష్ మొదలగు సబ్జెక్టులను బోధిస్తున్నారు. స్టడీమెటీరియల్‌ను అందజేస్తున్నారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో 1600 మీటర్లు, 800 మీటర్ల రన్నింగ్‌తోపాటు షాట్‌ఫుట్, లాంగ్‌జంప్‌లో శిక్షణ కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ రెండు నెలలపాటు కొనసాగనున్నది. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారిలో 32 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
నేను నిజామాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నా. ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ముందుగా కోచింగ్ కోసం హైదరాబాద్ పోదామనుకున్నా. కానీ.. అక్కడి కోచింగ్ సెంటర్లు వసూలు చేస్తున్న అధిక ఫీజులు చూసి భయమైంది. మాది చాలా పేద కుటుంబం. ఫీజుల భారం మోయలేం. ఇదే సమయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మిత్రుల ద్వారా తెలిసింది. వెంటనే నిర్మల్‌కు వచ్చి ఎంపిక కోసం నిర్వహించిన పరీక్ష రాశా. ఉచిత శిక్షణకు ఎంపికయ్యా. ఇక్కడి కోచింగ్ చాలా బాగుంది. సబ్జెక్టులకు సంబంధించిన అనుమానాలను అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు. అలాగే ఈవెంట్స్‌లో ఫిజికల్ డైరెక్టర్లు కఠోర శిక్షణనిస్తున్నారు.
– తరుణ్, చామన్‌పెల్లి, లక్ష్మణచాంద మండలం
ఈ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన యువతీ యువకు లకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే వారి జీవితాలు బాగుపడతాయి. ఈ ఉద్దే శంతోనే మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మల్‌లో ఉచిత కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాం. కానిస్టేబుల్ కోచింగ్‌తోపాటు త్వరలో వెలువడే గ్రూప్-2, 3, 4 ఉద్యోగాలకూ ఉచితంగా కోచింగ్ ఇస్తాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగా ల భర్తీకి ప్రకటన ఇవ్వడంతో శిక్షణ కోసం వెళ్లాలని అనుకు న్నా. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారని ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడ శిక్షణ బాగుంది. నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నా. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాలాంటి నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం మరువలేను.
– మహేశ్వరి, పెంచికల్పేట్
నేను డిగ్రీ సెకండియర్ కాగజ్‌నగర్‌లో చదువుతున్నా. పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. దూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి చదువుకో లేని పరిస్థితి నాది. ఎమ్మెల్యే కోనప్ప సార్ నిష్టాతు లైన అధ్యాపకులను ఎంపిక చేసి కాగజ్‌నగర్‌లోనే ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అదృష్టం. మాలాంటి పేద నిరుద్యోగ యువతీ యువకులు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నాం. అలాంటి మాకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగపడుతున్నది.
– జాడి అలేఖ్య, కాగజ్‌నగర్
ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఉన్న నిరుద్యో గులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండగా ఉంటున్నారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గత నెల 25 నుంచి ఉచిత శిక్షణ ప్రారం భించారు. నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసి కాగజ్‌నగర్‌లోనే ఉచితంగా వెయ్యి మందికి పైగా కోచింగ్ ఇస్తున్నారు. ఉద్యోగం సాధించాలన్న యువతీ యువ కులకు ఇది వరంగా మారింది. ఇక్కడ ఉచిత శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చడంతో పాటు భోజనం అందించడం విశేషం.
– కాగజ్‌నగర్ టౌన్, మే 9
పోలీస్ ఉద్యోగం ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో చదువుతున్నా. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్న శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆయా సబ్జెక్టులను నిష్ణాతులైన అధ్యాపకులతో బోధిస్తున్నారు. వారు చెబుతున్న విషయాలు చాలా బాగా అర్థమవుతున్నాయి. ఏదైనా సందేహం వస్తే నివృత్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు రుచికరమైన భోజనం, వసతి కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
– భవాని, కాగజ్‌నగర్
ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సహాయ, సహకారాలు అందిస్తున్నారు. జిల్లా గ్రంథాలయానికి చదువుకునేందుకు వచ్చే దాదాపు 300 మంది యువతీ యువకులకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజూ భోజనం కల్పిస్తున్నారు. దీంతోపాటు వారు కూర్చోవడానికి కుర్చీలు, మంచినీటి వసతి సమకూర్చుతున్నారు. దీంతో యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం ఒక వరం. అందులోనూ పేద, మధ్యతరగతి అభ్యర్థుల కోసం జోగు ఫౌండేషన్ సౌకర్యాలు కల్పించడం సంతోషకరం. ఎంఏ, బీఈడీ చేసిన నేను ఇప్పుడు టెట్, డీఎస్సీకి దీక్షగా ఈ లైబ్రరీలో ప్రిపేరవుతున్నా. పేద కుటుంబానికి చెందిన నేను మా పెండల్వాడ గ్రామం నుంచి ఉదయం ఏడు గంటలకే బయల్దేరుతా. 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆదిలాబాద్‌కు వచ్చి జిల్లాకేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్నా. ఇక ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ నిర్వహిస్తున్న జోగు ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్నం 250 మంది అభ్యర్థులకు చక్కని భోజనం పెడుతున్నారు. దీంతో నాలాంటి గ్రామీణ అభ్యర్థులకు ఎంతో మేలు జరుగుతున్నది. మధ్యాహ్న భోజనానికి ఎండలో హోటళ్లకు వెళ్లే ఇబ్బంది తప్పింది. ఆ ఖర్చులు మిగిలినట్లే. సరైన సమయంలో నిరుద్యోగులకు ఇలా సౌకర్యాలు కల్పిస్తున్న ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. దీక్షగా చదివి ఉద్యోగం సాధిస్తా.
-ఎన్ రాకేశ్, పెండల్వాడ, జైనథ్ మండలం
తలమడుగు మండలం సుంకిడి గ్రామం నుంచి నేను రోజూ ఉదయమే బయలుదేరి జిల్లా కేంద్రంలోని లైబ్రరీకి వస్తున్నా. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు చదువులో లీనమవుతున్నా. బీఈడీ చేసిన నేను టెట్, డీఎస్సీకి సిద్ధమవుతున్నా. నా భార్య తేజశ్రీ అటవీశాఖలో ఉద్యోగి. ప్రణాళికా ప్రకారం గ్రంథాలయంలోని పుస్తకా లు చదువుతున్నా. ఇక జోగు ఫౌండేషన్ వారు సమకూరు స్తున్న మధ్యాహ్న భోజనంతో మాకు వ్యయప్రయాసలు తగ్గాయి. ఎంచక్కా లైబ్రరీ మూసేవరకు చదువుకుంటున్నాం. ఒకసారి లైబ్రరీలోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లే అవసరమే లేదు. ఇలా మాకు సౌకర్యాలు కల్పిస్తున్న జోగు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు.
– నిమ్మల సాత్విక్‌రెడ్డి,
నేను సర్కారు గురుకుల విద్యాలయంలోనే చదివా. టీటీసీ పూర్తిచేసిన నేను ఇప్పుడు ఆదిలాబాద్‌లో గది కిరాయి తీసుకొని క్రమశిక్షణగా చదువుతున్నా. క్రమం తప్పక లైబ్రరీకి వచ్చి నిపుణులు సూచించిన పుస్తకాలను ఫాలో అవుతున్నా. ఇక్కడ జోగు ఫౌండేషన్ వారు మాకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం, మంచినీరు, భోజన సౌకర్యాలు కల్పించడంతో మాలాంటి పేదవారికి ఎంతో కలిసి వస్తున్నది. ఇక మా సోదరుడు వినయ్ కూడా హైదరాబాద్‌లో సర్కార్ కోచింగ్ సెంటర్లోనే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. మరో సోదరుడు కరీంగనర్ శాతవాహన యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు. ఇలా మా గిరిజన పేద కుటుంబాల విద్య, ఉద్యోగావకాశాలకు సీఎం కేసీఆర్ సార్ శ్రద్ధ చూపారు. స్థానికంగా జోగు ఫౌండేషన్ చేయూత బాగున్నది. కచ్చితంగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి తీరుతా.
– పెందూర్ సురేశ్ , టెట్ అభ్యర్థి , గుడిహత్నూర్