ఆదిలాబాద్ రూరల్, మే 5: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పోటీలను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు అనేక మంది ఉన్నారని, వారిని తమ సంఘం తరపున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రెండు శాతం అమలు చేస్తున్నామమని చెప్పారు. ప్రధాన కార్యదర్శి రాయేశ్ మాట్లాడారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈనెల 14,15తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, కోచ్ రవీందర్, డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.