నేరడిగొండ, మే 5 : ఎండ దెబ్బకు మనుషులే కాదు వాహనాలూ దెబ్బతింటున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నామో.. వాహనాల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనానికి పట్టిన గతే పడుతుందని మెకానిక్లు హెచ్చరిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ను ఎండలో ఉంచడం వల్ల పెట్రోల్ ట్యాంకులో మంటలు వ్యాపించి, వాహనం పూర్తిగా కాలిపోయింది. అలా కాకుండా ఉండాలంటే వాహనదారులు తమ వాహనాలను నీడపట్టునే ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే ఎక్కువసేపు ఎండలో ఉంచడం వల్ల వాటి రంగుమారడంతో పాటు పాతవిగా కనిపించే అవకాశం ఉంటుందని, ట్యాంకులో ఉండే పెట్రోల్ ఆవిరైపోతుందని అంటున్నారు.
భారీ వాహనాలైన లారీలు, ట్యాంకర్లు, కంటెనైర్లలో తరుచూ నీటిని పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎండకు ఇంజిన్ ఆయిల్ త్వరగా తగ్గిపోతుందని, ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కార్లలో గ్యాస్కిట్ను ఉపయోగించకుండా ఉంటే మంచిదని అంటున్నారు.
అధిక ఉష్ణోగ్రతలకు సిలిండర్ పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాతావరణం చల్లబడిన తర్వాత ఉపయోగిస్తే మంచిదని సూచించారు. భారీ వాహనాలకు కొత్త టైర్లు వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపారు. లేకుంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో టైర్లలో గాలి తగ్గిపోయి పేలే ప్రమాదం ఉంటుదని హెచ్చస్తున్నారు.
వాహనాలను చెట్టునీడలోగానీ, షెడ్లలోగానీ పార్కింగ్ చేసుకోవాలి. ఎండలో ఉంటే కాటన్ కవర్ కప్పాలి.ద్విచక్రవాహనదారులు తగిన మోతాదులో మాత్రమే గాలి పట్టించాలి. వీలైనంత వరకు దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎండలకు వాహనాల ఇంజిన్ రెండింతలు వేడెక్కే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో తరుచూ పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ ఇంజిన్ బాగా వేడెక్కితే కొద్దిసేపు ఆపి, బయల్దేరడం ఉత్తమం.బ్రేక్ షూ లు, రబ్బర్లు, పదిరోజులకు ఒకసారి పరిశీలించుకోవాలి.
వాహనదారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ ఎండ వేడిమికి పల్చగా మారి శక్తిని కోల్పోతుంది. 15 రోజులకోసారి ఇంజిన్ ఆయిల్ తనిఖీ చేస్తూ ఉండాలి. ద్విచక్రవాహనాలను ఎక్కువ సమయం ఎండలో ఉంచడం వల్ల పెట్రోలు ఆవిరైపోతుంది. పెట్రోలు మధ్యాహ్నం కంటే సాయంత్రం వేళలో పోసుకోవడం మంచిది. టైర్లలో గాలి విషయంలో ఆలస్యం ప్రదర్శిస్తే మన్నిక తగ్గిపోతుంది.
– పవార్ కృష్ణ, మెకానిక్, నేరడిగొండ