మంచిర్యాల అర్బన్, మే 5 : పల్లెల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు వేతనం పెరిగింది. రోజువారీ గరిష్ఠ వేతనానికి రూ.12 అదనంగా దక్కనున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కూలీల వేతన ధరల వివరాలతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం గరిష్ఠ వేతనం రూ. 245 ఉండగా.. మరో రూ.12 పెంచి రూ.257 చొప్పున చెల్లించేందుకు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 85వేల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనున్నది. పెంచిన కూలి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తించనుంది.
ప్రస్తుతం ఒక్కో కూలీకి చేసిన పనిని బట్టి ఒక్కో పని దినానికి గరిష్ఠంగా రూ. 245 చొప్పున చెల్లిస్తున్నారు. దీనిని మరో రూ.12 పెంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గరిష్ఠంగా రూ. 257 చెల్లించనున్నారు. జిల్లాలో 1,27,925 ఉపాధి హామీ జాబ్ కార్డులున్నాయి. 85,734 మంది కూలీలు యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 50 వేల మంది కంటే తక్కువగా కూలీలు పనులకు వస్తున్నారు. వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నందున కూలీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 2019-20లో రూ. 205 నుంచి రూ. 211కి, 2020-21లో రూ. 211 నుంచి రూ.237, 2021-22లో రూ. 237 నుంచి రూ.245 పెంచగా.. ఈ ఏడాది రూ.257కు ప్రభుత్వం పెంచింది.
హరితహారంలో భాగంగా గ్రామాల్లోని రహదారులు, ఇండ్లలో పెంచే మొక్కలను సంరక్షిస్తే ఒక్కో మొక్కకు రూపాయి నుంచి రూ.10, మొక్కల సంరక్షకులుగా వ్యవహరించే వారికి ఒక్కో మొక్కకు రూ.3 ప్రభుత్వం ఇవ్వనున్నది. రోడ్ల వెంబడి మొక్కలను కాపాడడం, మట్టిని చదును చేయడం, మొక్కల శాఖలను కత్తిరించి ఏపుగా పెరిగేలా చూడడం తదితర పనులు చేస్తూ 400 మొక్కలను సంరక్షించిన వారికి నెలకు రూ.6,425 చెల్లించనున్నారు. ఉద్యాన మొక్కలను సంరక్షిస్తే మొక్కకు రూ.10, నర్సరీల్లోని వెయ్యి మొక్కలకు నీటిని పెట్టినందుకు రూ.320.98 అందించనున్నారు. అంతే కాకుండా మట్టి పనుల్లో చేసిన పరిమాణం మేరకు కూలిని సైతం నిర్ణయించింది. మొక్కలు నాటేందుకు అడుగు వెడల్పు, లోతు కలిగిన గుంత తీస్తే ఒక్కో గుంతకు రూ. 7.71 లభించనున్నది. మూడు అడుగుల వెడల్పు, లోతు కలిగిన గుంత తీస్తే ఒక్కో గుంతకు రూ.163.25, గట్టి భూమిలో ఇదే గుంతకు రూ.195.32 చెల్లించనున్నారు.
పెంచిన వేతనంతో నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఉపాధి హామీ పథకంలో పనులు కేటాయించి, కొలతలు వేసి, చెల్లింపులకు మస్టర్ నమోదు చేస్తారు. అందుకు అనుగుణంగా కూలీలకు డబ్బులు చెల్లిస్తారు. వేసవిలో నిర్దేశిత కొలతల ప్రకారం కేటాయించిన పనిలో కొంత చేయలేకపోయినా సమాన వేతనం అందుతుంది. ఉదాహరణకు ఒక చదరపు మీటర్ పనికి రూ.100 చెల్లించాల్సి ఉంటే.., ఆ పనిలో కాస్త తగ్గినా రూ. 100 పూర్తిగా చెల్లిస్తారు. కూలీలకు గరిష్ఠ వేతనం లభించేలా సంబంధిత అధికారులు పనులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు.
గరిష్ఠ వేతనం రూ. 257కు పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నాం. ఈ ఏడాది (2022-23 ఆర్థిక సంవత్సరంలో) 39 లక్షల 9 వేల 257 పని దినాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. దీనికి సంబంధించి ఇది వరకే గ్రామ సభలు పెట్టి చేపట్టాల్సిన పనులను గుర్తించాం. ఇందుకోసం కూలీలకు రూ.95,77,67,965, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.63,72,08,891 కలిపి మొత్తం రూ.159.49 కోట్లు వెచ్చించాం. పెంచిన కూలీని ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలి.
– శేషాద్రి, డీఆర్డీవో, మంచిర్యాల