ఎదులాపురం,మే 5: మన-ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మన ఊరు- మన బడి మొదటి విడుతలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహారీ తదితర పనులు చేపట్టాలని సూచించారు.
రెండు రోజుల్లోగా ప్రతి పాఠశాల అంచనాలను సిద్ధం చేసి అందించాలని, వాటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా రూ.30 లక్షల లోపు అంచనాతో చేపట్టే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు రూ.30లక్షల పైన ఖర్చుతో చేపట్టే పనులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు పూర్తిచేసి పనులను ప్రారంభించాలన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేరొన్నారు. సమావేశంలో డీఈవో ప్రణీత, డీఆర్డీఏ కిషన్, జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పార్ట్ టైం వర్కర్లు పనిచేస్తున్న వారందరికీ ప్రతి రోజు రూ.599 చొప్పున వేతనం చెల్లించేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి గురువారం వినతి పత్రం ఇచ్చారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవోతో చర్చించి వేతనాలు పెంచుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్, గౌరవాధ్యక్షుడు కేబీసీ నారాయణ, ప్రధాన కార్యదర్శి సిడాం శ్రీనివాస్, కోశాధికారి కేంద్రే వినయ్, రంభ, చందు, నితిన్, సుశీల, ఈరమ్మ పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. దళిత బంధు కార్యక్రమం అమలు తీరుపై కలెక్టరేట్లో నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. దళితబంధు పథకానికి జిల్లాలో 248 మందిని ఆయా నియోజకవర్గాల శాసన సభ్యుల అంగీకారంతో ఎంపిక చేశామని, ఇప్పటి వరకు 225 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. 209 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వెల్లడించారు.
ఇందులో 73 మందికి వ్యవసాయ అనుబంధ యూనిట్లు, 80 మందికి ట్రాన్స్పోర్ట్ సెక్టార్, 56 మందికి ఇతర సెక్టార్లలో యూనిట్లు మంజూరు చేశామని చెప్పారు. ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. లబ్ధిదారులనుకలిసి యూనిట్ల స్థాపన, పని తీరు, తదితర అంశాలను సమీక్షించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.