తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సబ్బండ వర్గాల ప్రజలను సుసంపన్నం చేస్తున్నది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఫలాలు అందిస్తున్నది. ఒక్కో కుటుంబం ఐదు నుంచి ఆరు పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. ప్రధానంగా దళితబస్తీ, రుణమాఫీ, రైతుబంధు, ఉచిత కరంటు పొందుతూ లక్షాదికారులుగా మారారు. వీరితోపాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కూడా ప్రగతి ఫలాలు పొందుతున్నారు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్న సర్కారును ఎక్కడా చూడలేదని, సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కాంగ్రెస్ నాయకులు కొనియాడడం కొసమెరుపు.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, మే 5(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం పథకాలు తీసుకోవాలంటే పైరవీలు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగాల్సి వచ్చేది. గత ప్రభుత్వం అమలు చేసిన అరకొర పథకాలు అర్హులకు అందేవీ కావు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పార్టీకి చెందిన వారికే సర్కారు సాయం వచ్చేలా చూసేవారు. దీంతో రైతులు, పేదలు, ఇతర వర్గాల ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం పథకాలను నోచుకోలేక పోయారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కడుపులో ఉన్న శిశువు మొదలుకుని మంచాన పడిన వృద్ధులు ప్రభుత్వం సంక్షేమ పథకాలను పొందుతున్నారు. పథకాల అమలులో అన్లైన్ విధానం అమలు చేయడం, పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించడంతో అర్హులందరూ సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్నారు.
రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాల్లో కాంగ్రెస్ శ్రేణులు లబ్ధిదారులుగా ఉన్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పథకాలను ప్రశంసిస్తున్నారు. జిల్లా పరిషత్, మండల సమావేశాలు, ఇతర మీటింగ్‌లలో పథకాలను కొనియాడుతున్నారు. ప్రభుత్వం పథకాలను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.
మాకు వ్యవసాయ భూమి లేదు. కూలీ పని చేసుకుంటూ జీవనం గడిపేవాళ్లం. పని చేస్తేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. లేకపోతే పస్తులు ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చింది. మాలాంటి దళితులకు కేసీఆర్ సారు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించారు. మాట ప్రకారం మాకు మూడెకరాల భూమి ఇచ్చాడు. దీని విలువ దాదాపు రూ.15 లక్షలకుపైగా ఉంటుంది. మా వద్ద పైసలు లేకపోవడంతో దళిత అభివృద్ధి శాఖ నుంచి రూ.90వేలతోపాటు బోర్, కరంటు మోటర్‌కు రూ.1.50 లక్షలు సర్కారు అందించింది.వీటితో నాలుగేండ్లుగా ఎవుసం జేస్తన్నం. రెండు పంటలు పండిస్తున్నం. ఖర్చులు పోనూ రూ.2 లక్షల ఆదాయం వస్తున్నది. నాలుగేండ్లుగా రైతుబంధు కింద యేడాదికి రూ.30 వేల చొప్పున రూ.1.20 లక్షలు ప్రభుత్వం ఇచ్చింది. దీంతో పాటు నా కూతురు వివాహానికి కల్యాణలక్ష్మీ రూ.1,00,116 వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉండడంతోనే నాలాంటి పేదలకు మేలు జరుగుతున్నది. ఇప్పటికి కాంగ్రెసోళ్లు పాలించి ఉంటే ఈ భూమి, డబ్బులు వచ్చేవి కావు. కేసీఆర్ సారు సల్లంగుండాలె.
– తల్వారే లక్ష్మీబాయి, ముక్రా(కే), ఇచ్చోడ మండంలం, ఆదిలాబాద్ జిల్లా.
కోటపల్లి, మే 5: నాకు కోటపల్లిలో రైస్‌మిల్లు ఉంది. చుట్టు పక్కల గ్రామాల రైతులు ఇక్కడికే వడ్లు తీసుకొస్తరు. తెలంగాణ సర్కారు అచ్చినప్పటి నుంచి కరంట్ ఫుల్లుగా ఉంటున్నది. పనికి ఇబ్బందయిత లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాల పాలనలో కరంట్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక గిర్నీ పట్టేందుకు ఇబ్బందయ్యేది. కరంట్ కటింగులతో వడ్లు తెచ్చే రైతులకు తిప్పలయ్యేది. గంటల కొద్దీ మిల్లులనే ఉండేది. జనరేటర్ పెట్టుకుందామన్నా పైసల్ ఎక్కువయితయని, గిట్టుబాటు కాదని కరెంటు వచ్చినంకనే రమ్మనేటోన్ని. కరెంటు రావడం ఆలస్యమైన కొద్దీ మంది ఎక్కువై పనికి కూడా ఆటంకమయ్యేది. గిప్పుడు గసోంటి తిప్పలు లేవు. ధాన్యం తీస్కరాంగనే పట్టించి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి పంపుతున్నం. రైతులందరూ గిప్పుడు సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నరు. గతంలో ఈ ఇబ్బందులు పడలేక మానేసినోళ్లు కూడా గిప్పుడు ఎవుసమే మంచిగున్నదని మళ్లీ చేసుకుంటున్నరు.
– నేరెళ్ల ప్రకాశ్, రైస్‌మిల్ యజమాని, కోటపల్లి
తాండూర్, మే 5: గోపాల్‌నగర్ శివారులో నాకు ఐదెకరాల భూమి ఉంది. నాకు రైతు బంధు సాయం ప్రతి ఏడాదీ నా అకౌంట్ల పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన రైతు బంధు పథకం నాలాంటి ఎందరో రైతుల సమస్యల పరిష్కారానికి దారిదీపంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలే. ఎవుసం దండుగ అన్న రీతిలో మాట్లాడిన్రు. సీఎం కేసీఆర్ వచ్చాకే రైతుకు మంచి జరుగుతున్నది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్ ఇచ్చి, రైతుల ఇక్కట్లను తొలగించిండు. సన్న చిన్నకారు రైతులకు ఈ పథకం ఎంతో మేలు చేసింది. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం తిరగాల్సిన పనిలేకుండా సర్కారే అన్నీ అందిస్తున్నది. ముఖ్యంగా 24 గంటల కరంట్‌తో ఎవుసానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేసిండు. తెలంగాణొస్తే ఈ ప్రాంతం అంధకారమైతదని చెప్పినోళ్లకు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిండు. ఇప్పుడు అన్ని రాష్ర్టాలు అంధకారంలో ఉంటే, మన రాష్ట్రంలనే మిగులు కరంట్ ఉంటున్నది. గతంలో ఏదీ సమయానికి అందక ఎన్నో ఇబ్బందులు పడినం.
-గజ్జెల సత్యనారాయణ, గోపాల్‌నగర్, తాండూర్
కడుపులో ఉన్న శిశువు నుంచి మంచాన పడిన వృద్ధుడి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ ఉండడంతోనే ఇన్ని పథకాలు అమలవుతు న్నాయి. గత ప్రభుత్వాల కంటే టీఆర్ ఎస్ సర్కారు అందిస్తున్న సాయంతో పేదలకు, రైతులకు అందరికీ మంచి జరుగుతు న్నది. నాకు గ్రామంలో ఐదెకరాల భూమి ఉంది. యేడాదికి రూ.50 వేల చొప్పున రైతుబంధు వస్తున్నది. ప్రభుత్వం నాకు రూ.2వేలు వృద్ధాప్య పింఛన్ అందిస్తున్నది. గతంలో తీసుకున్న రూ.1 లక్ష బ్యాంకు లోన్‌ను ప్రభుత్వం మాఫీ చేసింది. నా మనవరాలు వివాహం జరుగగా ప్రభు త్వం కల్యాణలక్ష్మీ పథకంలో భాగంగా రూ.1,00,116ను అందజేసింది. ఇలాంటి పథకాలు నేను ఎన్నడూ చూడలేదు. దేశంలో ఎక్కడా అమలవుతున్నట్లు కూడా వినలేదు.
– జాదవ్ శంకర్, ముక్రా(కే), ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా.
భీమారం,మే 5: రైతు బంధుతో ఊరూ రా సాగు పెరిగింది. రైతులంతా ఎంతో లాభపడుతున్నరు. ఏ ఒక్క ప్రభుత్వమూ గతంలో మమ్మల్ని ఆదుకుంటమని సూడలే. రైతు బంధు లాంటి పథకాన్ని సీఎం కేసీఆర్ తెచ్చి, అందరినీ బతికిం చిండు. లేకుంటే ఎవుసమంటేనే భయపడినోళ్లు, ఇయ్యాల పండుగలా పంట తీస్తున్నరు. గతంలో ఉన్న కాంగ్రెసోళ్లు రైతులకు చేసిన మేలేందో ఒక్కట న్నా చెప్పాలే. రైతుల కష్టాలు అర్థం చేసుకున్నది సీఎం కేసీఆర్ సార్ ఒక్కరే. రైతు బంధు, రైతు బీమా ఇచ్చి అండగా నిలబడి న్రు. కాంగ్రెస్ హయాంలో ఒక్క రైతన్నా బాగుపడిన దాఖలా లు లేవు. ఈ ఏడేళ్లలో మాకు ఎంతో మేలు జరిగింది. నాకు ఏడెకరాల భూమి ఉన్నది. మాకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ. 70 వేలు వస్తున్నది. పంట పెట్టుబడికి ఇది ఎంతో ఉపయోగపడుతున్నది.
-బండి రోషయ్య, భీమారం
కుంటాల, మే 5:మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల బతు కుల్లో ఆనందం వెల్లివిరిసింది. అన్ని వర్గాల ప్రజలకు దళారుల ప్రమేయం లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతు న్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా తదితర పథకాలతో పేద కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు గొల్ల కుర్మలను ఎంతగానో ఆదుకున్నాయి. స్వరాష్ట్రంలో పేద ప్రజలు ఆర్థికాభివృద్ధి చెంది ఆనందంతో జీవిస్తున్నారు.
-లింగన్న, రైతు అంబకంటి
గతంలో కరంట్ కోతలు, విత్తనాల కొరత నకిలీ ఎరువులతో మోసపోయి గోసపడినం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయి రైతుల రంది తీర్చిండు. వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర కరంట్, రైతు బీమా, రైతుబంధు, రాయితీ ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర కల్పించి రైతులను ఆర్థికంగా అభివృద్ది పథంలోకి ప్రభుత్వం తీసుకవెళుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులం సర్వదా అండగా ఉంటాం.
-గోపు రాజేశ్వర్, రైతు అంబకంటి
వేమనపల్లి, మే 5: నా భర్త కుర్మ భీమయ్య అనారోగ్యంతో మూడేళ్ల క్రితం చనిపోయిం పడ. దీంతో రైతు బీమా పథకం కింద రూ. 5 లక్షలు ప్రభుత్వం పది రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ డబ్బులతో ఇల్లు కట్టుకున్న. వ్యవసాయ భూమిలో బోరు వేయించిన. నా ఇద్దరు కూతుళ్లు కొడుకును మంచిగ చదివించుకుం టున్న. నా భర్త పోతే పిల్లలను ఎట్ల పెంచి పెద్ద చేసుడో అని రంది ఉండే. దేవుడిలెక్క సీఎం కేసీఆర్ సారు అండగా నిలిచిండు. సీఎం కేసీఆర్ సారు ఇరవై ఏండ్లు సీఎంగా ఉంటే మరికొందరి బతుకులు బాగుపడతయ్. మంచి చేసే మంచితనం సారుకు మాత్రమే ఉంది. తెలంగాణల ఎందరి బతుకుల్నో బాగు చేసి, నేనున్నా అని అండగా నిలిచిండ్రు.
-కుర్మ విజయ, జిల్లెడ
నా పేరు గుమ్ముల ముత్తన్న. మాది నిర్మల్ రూరల్ మండలం కౌట్ల(కే). ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున మంజులాపూర్ పీఏసీఎస్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కంటే చరిత్రలో ఏ పార్టీ ఇవ్వని పథకాలను టీఆర్ఎస్ సర్కారు అమలు చేసి చూపుతున్నది. నాది మధ్య తరగతి కుటుంబం కావడంతో సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న. నాకు గ్రామ శివారులో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం కింద యేటా రూ.40 వేలు వస్తున్నాయి. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ పొందుతున్నా. వరి, మక్క, పసుపు సాగు చేస్తున్న. యేడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తున్నది. నాకు రైతుబీమా కూడా వర్తిస్తుంది. ప్రమాదవ శాత్తు ఏమైనా జరిగినా నా కుటుంబానికి రూ.5 లక్షలు వస్తాయి. నా భార్య శ్రావణి బీడీలు చుడుతది. నెలకు రూ.2వేల పింఛన్ అందుతున్నది. రేషన్ కార్డు ద్వారా నెలకు రూ.24 కిలోల బియ్యం వస్తున్నాయి. మా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా ఇన్ని పథకాలు అమలు కావడం లేదనుకుంటా. భవిష్యత్తులో కేసీఆర్‌కు అండగా ఉండేందుకు వెనుకాడబోము.
స్వాతంత్య్ర భారతావనిలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలపాటు పాలించింది. రైతులు, ప్రజలకు చేసింది అంతంతే. హస్తం నాయకుల పాలనలో కరంటు సక్రమంగా ఉండేది కాదు. పంటలకు నీరందక ఎండి రైతన్నలు అరిగోస పడేవారు. బావులకాడ, అప్పుల పాలై ఉరేసుకొని వందలాది మంది మృత్యుఒడికి చేరారు. ఇగ, అవినీతి రాజ్యమేలేది. ఏ పని కావాలన్నా డబ్బులు లేనిది అయ్యేది కాదు. సంక్షేమ పథకాలు అంతంత మాత్రంగానే ఉండేవి.
స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడ్డాయి. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరంటు, పింఛన్, కల్యాణలక్ష్మి వంటి వందలాది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. శిశువు కడుపులో పడ్డప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.