నిర్మల్ అర్బన్, మే 5 : ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం ప్రత్యక్ష పద్ధతిలో శుక్రవారం నుంచి ప్రారంభమవనుండగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు పూర్తిచేసి, సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేసింది.
మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థులను డీబార్ చేయడంతో పాటు ఇన్విజిలేటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రథమ, శనివారం నుంచి ద్వితీయ సంవత్సరం షురూ అవుతుండగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 15,201 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారు. కాగా, ఇప్పటికే పరీక్షా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల నుంచి 15,201 మంది విద్యార్థులు పరీక్షల రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 6,207 మంది, వొకేషనల్ విద్యార్థులు 1133 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ 6,374 మంది, వొకేషనల్ 1172 మంది, ప్రైవేట్‌గా 89 మంది పరీక్షకు హాజరవుతున్నారు. వీరి కోసం నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో మొత్తం 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇందుకు 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 25 మంది విద్యార్థులకు ఓ ఇన్విజిలేటర్‌ను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా సమయంలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి, తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాగా, విద్యార్థుల కోసం ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు.
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపట్టాం. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ప్రత్యేక తనికీ బృందాలను ఏర్పాటు చేశాం. హాల్ టికెట్లను జారీ చేసేందుకు విద్యార్థులపై ప్రైవేటు కళాశాలల నుంచి ఒత్తిడి లేకుండా చూడాలని ఆదేవించాం. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
– పరశురాం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, నిర్మల్