తానూర్, మే 4 : వేసవిలో దుక్కులు దున్న డం వల్ల భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తొలకరి మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవిలో దుక్కులు దున్నడం వల్ల చీడపీడల నివారణతో పాటు పంట దిగుబడి పెరుగుతుందంటున్నారు వ్యవసాయ అధికారులు. వేసవిలో చేపట్టాల్సిన పనులపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. దీనిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
వేసవిలో దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న చేనులో ట్రాక్టర్లు, ఎడ్ల నాగళ్లతో లోతుగా దుక్కులు దున్నాలి. 9 అంగుళాలకు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం మంచిది. లోతుగా దున్నినప్పుడు నేలపై పొరల్లో ఉండే పురుగులు, తెగుళ్లను ఆశించే పురుగులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉండడంతో పాటు నేలలో దాక్కునే క్రిమికీటకాలు ఎండల బారిన పడి నశిస్తాయి. దీంతో పంట సమయంలో క్రిమికీటలకాల ప్రభావం తక్కువ ఉంటుది. అధిక దిగుబడి వస్తుంది. పంట పొలంలో కలుపు నివారించుకోవడం, ఎక్కువగా తుంగ, గరిక, ఒలిపిడి వంటి కలుపు మొక్కలతో రైతులకు నష్టం ఏర్పడుతుంది. వేసవి దుక్కులు దున్నుకోవడంతో కలుపు మొక్కల వేర్లు కాయలు, దుబ్బలు చచ్చిపోయి బయటకు వచ్చి ఎండకి ఎండిపోతాయి. ఎండిపోయిన వేర్లు, కాయలు, దుంపలను ఏరివేస్తే మంచి ఫలితం ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే తొలకరి వర్షంలోనే విత్తనాలు విత్తుకునే పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
గతంలో రైతులు ఎద్దులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలకు రాత్రిళ్లు పొలంలో మందలు పెట్టేవారు. పశువుల మలమూత్రాలతో సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ఉపయోగపడేది. దీంతో రైతులకు ఎరువు ఖర్చు తక్కువగా ఉండేది. ప్రస్తుతం పశువులు తగ్గిపోవడంతో పంటలకు సేంద్రియ ఎరువు వాడకం తగ్గిపోతున్నది. ప్రస్తుతం రైతులు వేసవిలో పంట చేలు, పొలాల్లో గొర్రెల మంద, బర్రెల మందను వారం పది రోజుల పాటు ఏర్పాటు చేసుకుంటే మంచి సేంద్రియ ఎరువు లభిస్తుంది. లేదా పశువుల మలమూత్రాలను సేకరించి వ్యవసాయ భూమిలో వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు అధికారులు.
వేసవి దుక్కులతో కలిగే ప్రయోజనాలపై రైతులకు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. ఊరురా గ్రామసభలు నిర్వహించి సాగులో తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు రైతులకు తెలియజేయాలి. చాలా మంది రైతులకు దుక్కులపై అవగాహన లేక నష్టపోతున్నారు.
వేసవి దుక్కులతో వర్షాకాలంలో మంచి ఫలితా లు వస్తాయి. 9 అంగుళలాల లోతుగా దున్నుకునేందుకు ఆసక్తి చూపాలి. వేసవి దుక్కులతో పొలంలో ఉన్న చీడపీడ పురుగులు నశించి పంట దిగుబడి పెరుగుతుంది. నాగలితో దుక్కులు దున్నడం మంచిది. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
గణేశ్, ఇన్చార్జి ఏవో