మహారాష్ట్ర సర్కారు ఎవుసానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నది. అది కూడా వారం రోజులు పగలు ఏడు గంటలు.. మరో వారం రోజులు రాత్రి ఏడు గంటలు అందిస్తున్నది. ఫలితంగా బీడువారి నెర్రలు వారిన నేలలు, ఎండిన పంటలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత పవర్ ఇస్తున్నారు. ఎటుచూసినా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గ్రామాల వారు మన కరంటును వినియోగిస్తూ బంగారు పంటలు పండిస్తున్నారు. బంధువులు, స్నేహితుల భూముల నుంచి పైప్లైన్ల ద్వారా సాగుకు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. మరీకొందరైతే తెలంగాణలో భూములు కొనుగోలు చేసి పంటలు పండిస్తున్నారు. తెలంగాణ సర్కారు రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో తాము కూడా ఉపాధి పొందుతున్నామని ఆనందంగా తెలుపుతున్నారు.
ఆదిలాబాద్, మే 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా ఆదిలాబాద్ జిల్లా రైతులు వ్యవసాయం చేయలంటే భయపడేవారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు నీరు అందించలేక నష్టపోయేవారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి చివరిదశలో నష్టపోయేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు వానకాలం, యాసంగి పంటలకు బోర్, వ్యవసాయ బావుల ద్వారా నీరు అందిస్తున్నారు. సర్కారు అందిస్తున్న ఉచిత విద్యుత్ ఉమ్మడి జిల్లాలోనే రైతులకు కాకుండా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని రైతుల ఉపాధిని మెరుగుపర్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని బేల, జైనథ్, తాంసి, తలమడగు, బోథ్.. నిర్మల్ జిల్లాలోని కుభీర్, సారంగాపూర్, కుంటాల, తానూర్, బాసర మండలాల్లోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు తెలంగాణ విద్యుత్ ద్వారా తమ పంటలకు సాగునీటిని అందిస్తున్నారు.
మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం రోజు ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. వారం రోజులు పగలు, మరోవారం రాత్రి సమయాల్లో విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నది. పంటలకు నీటిని సరఫరా చేయడానికి విద్యుత్ సౌకర్యం సరిగా లేకపోవడంతో అక్కడ రైతులు పక్కనే ఉన్న తమ బంధువులు, స్నేహితులు పంటపొలాల్లోని బోరుబావుల నీటిని వాడుకుంటున్నారు. పైప్లైన్లు వేసుకుని పంటలకు నీటిని సరఫరా చేసుకుంటూ రెండు పంటలు పండిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడి రైతులకు కాకుండా తమకు కూడా దేవుడిలా ఆదుకుంటున్నాడని మహారాష్ట్ర రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా మథోల్ నియోజకవర్గం కుభీర్ మండలంలోని తెలంగాణ సరిహద్దు గ్రామాల నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా చెందిన రైతులు వారు బంధువులు, స్నేహితుల వ్యవసాయ భూముల్లోని సాగునీటి వనరుల నుంచి నీటిని తమ పంటపొలలాకు తరిలిస్తున్నారు. సారంగాపూర్ మండలం జెవ్లీ, కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండా నుంచి మర్లగొండకు, నిగ్వ నుంచి దివిషి, పంగర్పహాడ్ నుంచి మహారాష్ట్ర, పార్టీ(కే) తండా నుంచి మొఖండీ, రంజనీ తండా నుంచి కొస్మిట్, సిర్పెల్లి నుంచి పాలజ్‌కు పైపులైన్ల వేసి తమ పంటల పొలాలకు నీటిని తీసుకుపోతున్నారు. రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాము దేవుడిగా భావిస్తామని వారు అంటున్నారు.
మహారాష్ట్రవాసులు మన సరిహద్దు గ్రామాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నాలుగైదు ఏండ్లలో మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, వాంకిడి మండలాల్లో కొనుగోలు చేశారు. కెరమెరి మండలంలోని బోలాపటార్, గౌరి, నారాయణగూడ గ్రామాల్లో సుమారు 20 మంది మన రైతుల వద్ద 50-60 ఎకరాల వరకు కొన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పొందవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన గిరిజనులు ఇక్కడి గిరిజనుల వద్ద భూములు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
తెలంగాణలో నాకు భూమి ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జెవ్లీ రెవెన్యూ గ్రామంలో నాకు 9 ఎకరాల భూమి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఉచిత కరంటుతో నేను రెండు సీజన్లలో 8 ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్నా. వానకాలంలో ఐదెకరాల్లో వరి, నాలుగెకరాల్లో కంది, సోయా వేశా. ఖర్చులు పోనూ రూ.2లక్షల ఆదాయం వచ్చింది. యాసంగిలో మక్క ఎనిమిదెకరాలు, నువ్వుల పంట ఒక ఎకరంలో వేశా. 240 క్వింటాళ్ల మక్కలు రాగా.. అమ్మగా ఖర్చులు పోను రూ.4 లక్షలు మిగిలాయి. నువ్వు పంటకు తెలంగాణ కరంటుతో రోజు నీటిని అందిస్తున్నా. రైతులకు సీఎం కేసీఆర్ చేస్తున్న సాయం మరువలేనిది.
– దన్గరి మల్లయ్య, రైతు, అప్పారావుపేట, మహారాష్ట్ర
మాది మహారాష్ట్రలోని కుంభఝరి. నేను మా బంధువులందరం కలిసి ఇక్కడ దాదాపు ఐదారేళ్ల కిందట సుమారు తొమ్మిదెకరాలు కొనుగోలు చేశాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను చూసే భూములు కొన్నాం. ప్రధానంగా ఉచిత కరంటుకు ఆకర్షితులయ్యా. రెండు పంటలు పండిస్తున్నా.
– పవార్ తుకారం, రైతు, మహారాష్ట్ర
నా పేరు సుందిళ్ల రామకృష్ణ. నేను చెన్నూర్‌లో వెల్డింగ్ షాపు నడిపిస్తున్న. గతంలో ఇండ్లకు, షాపులకు కట్టె తలుపులనే వాడేది. ఇప్పుడందరూ ఇనుప తలుపులనే పెట్టుకుంటున్నరు. గిరాకీ ఫుల్లుగా ఉంటున్నది. రంజన్ల స్టాండ్లు, తలుపులు, కిటికీలతో రికాం లేకుండా పనిదొరుకుతున్నది. గతంలో కరెంటు సతాయించుడుతోని పనికి ఇబ్బందయ్యేది. చెప్పిన టైంకు వస్తువులు చేసియ్యాలంటే కష్టమయ్యి మాటలు పడాల్సి వచ్చేది. తేపతేపకు కరెంటు పోతుంటే పనిచేసేతందుకు కూడా తరాసు వచ్చేది. కేసీఆర్ గవుర్నమెంటు వచ్చినంక ఇచ్చిన మాట ప్రకారం కరంటు మీద దృష్టి పెట్టిండు. కరంటుకయితే రంది లేకుండా ఉన్నది. అస్సలు పోతలేదు. పనులు సుత తిప్పలు లేకుండా చేసుకుంటున్నం. ఆర్డర్లు పెరిగినయ్. ఇన్టైంల ఇస్తుండడంతోని కస్టమర్లు కూడా సంతోషంగా ఉన్నరు. 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి సారుకు ధన్యవాదాలు.
– సుందిళ్ల రామకృష్ణ, వెల్డింగ్ షాప్ యజమాని, చెన్నూర్
తెలంగాణలనే ఫుల్లుగా కరంటు ఉంటున్నది. ఇక్కడ అమలు చేసే ఏ ఒక్క పథకమూ మాకాడ కానరాదు. మహారాష్ట్రల ఎవుసానికి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు కరంట్ బిల్లులే కడుతున్నం. తెలంగాణల మాత్రం రైతులకు ఉచితంగా ఇస్తున్నరు. కరంట్ మంచిగుంటనే పంటలు మంచిగ పండుతయ్. మా రాష్ట్రంల ఎకరాకు 9 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొంటరు. తెలంగాణల అట్ల ఏం ఏం లేదు. ఇక్కడి వాసులు చాలా అదృష్టవంతులు. మాక్కూడా ఇట్ల కరంట్ ఉంటే మంచిగుండు.
– సంతోషపు రవి, రామనుజపురం (మహారాష్ట్ర)
మా ఊరిలో మహారాష్ట్ర వాసులు దాదాపు 20 మంది 50-60 ఎకరాలు కొనుగోలు చేశారు. కానీ.. వీరికి పట్టాలు కాలేదు. ఉచిత కరంటుతో భూములు కొనుగోలు చేశామని వారు తెలుపుతున్నారు. రైతులేకాకుండా ఇతరులు కూడా తెలంగాణకు వలస వస్తున్నారు. వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
– సూర్యవంశీ పరమేశ్వర్, మాజీ సర్పంచ్, బోలాపటార్, కెరమెరి మండలం
నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణ సర్కారు ఇస్తున్న 24 గంటల ఉచిత కరంటుతో వానకాలంలో పత్తి, వరి.. యాసంగిలో జొన్న, నువ్వులు సాగు చేస్తున్న. మహారాష్ట్రలో ఉంటున్న నా బంధువులు పైప్‌లైన్ వేసుకొని నీటిని తమ పంట పొలాలకు తీసుకెళ్తున్నరు. తెలంగాణ సర్కారు ఇస్తున్న ఉచిత కరంటుతో నాతోపాటు మహారాష్ట్రలో ఉంటున్న మా బంధువులు కూడా రెండు పంటలు పండిస్తున్నారు.
– జాదవ్ తానాజీ, రైతు, మహారాష్ట్రలోని మర్గగొండ