ఆయిల్ పాం రైతుకు రాష్ట్ర సర్కారు శుభవార్త అందించింది. సంప్రదాయ పంటలు సాగుచేస్తున్న అన్నదాతను లాభాల బాటపట్టించేందుకు ఈ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నిర్మల్ జిల్లాలోనే ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంత్రి అల్లోల సహకారంతో పాక్పట్ల శివారులో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గురించిన అధికార యంత్రాంగం, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నది.
– నిర్మల్ టౌన్, మే 3
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు పత్తి, సోయా, వరి, మక్క, కంది పంటలు సాగుచేస్తున్నారు. మార్కెట్లో ఆశించిన స్థాయిలో డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కువ లాభాలు ఆర్జించలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో లాభసాటిగా ఉండే ఆయిల్ పాం సాగుపై ఆసక్తి పెంచింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పుష్కలమైన నీటి వనరులు, సారవంతమైన భూములు ఉండడంతో ఈ ఏడాది సుమారు 10 వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు పెంపకాన్ని చేపట్టేలా రంగం సిద్ధం చేసింది. కాగా, రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో నర్సరీని కూడా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి రైతులకు అవసరమయ్యే మొక్కలను అందించేందుకు సిద్ధం చేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మొత్తంగా లక్ష ఎకరాల్లో ఆయిల్ పాం సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే ఈ రెండు జిల్లాలకు చెందిన 6వేల మంది రైతులు సాగు కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో నెల రోజుల్లో మరో 4 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తిచేసేలా ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీరవెల్లిలోని నర్సరీలో 4.60 లక్షల మొక్కలను అందుబాటులో ఉంచారు.
నిర్మల్ జిల్లాలోనే ఆయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలైంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గల పాక్పట్ల శివారులో అధికారులు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దానిని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో నిర్వహించే ఈ ప్రాసెస్ యూనిట్‌కు సాగు ఆధారంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు యూనిట్ కాస్ట్ వచ్చే అవకాశం ఉన్నదని కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు. స్థానికంగానే రైతుల నుంచి ఆయిల్ పాం గెలలను కొనుగోలు చేసి, ఇక్కడే ఆయిల్ తయారు చేసేలా ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు.
దీంతో పెట్టుబడికి తగిన లాభాలు వచ్చే అవకాశం ఉండడతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఈ సాగు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించేందుకు ఉద్యానవనశాఖ అధికారులు చర్యలు చేపట్టడంతో పామాయిల్ రైతులకు రాబోయే కాలంలో మంచి రోజులు రానున్నాయి. పామాయిల్ మొక్కకు రూ.200 కాగా, ప్రభుత్వం రూ.20కే అందిస్తున్నది. దీనికి తోడు డ్రిప్, బింధుసేద్యం పరికరాలను సబ్సిడీపై ఇస్తుండడంతో రైతులు ఆసక్తి పెంచుకుంటున్నారు.