యాసంగి వడ్లు కేంద్రమే కొనాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా గులాబీ సైన్యం రణనినాదం మోగించింది. దేశం నలుదిక్కులకు వినపడేలా.. తెలంగాణ రైతాంగ సమస్యను విడమరిచి వివరించింది. రైతు దీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు హాజరుకాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి 24 గంటల అల్టిమేటం జారీ చేశారు.
ధాన్యం కొంటారా? కొనరా? ఏదో ఒకటి తేల్చిచెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం కోసం దేశ చరిత్రలో ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీస్థాయిలో దీక్షకు దిగడం తొలిసారి కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సంపూర్ణ మద్దతు పలికింది. టీఆర్ఎస్ చేపట్టే ఉద్యమంలో భాగస్వాములమవుతామని చెబుతూనే.. కేంద్రం ధాన్యాన్ని కొనేవరకూ ఆ పార్టీ లీడర్లను ఊళ్లలోకి అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇదే మొండి వైఖరి ప్రదర్శిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహరచనకు అన్నదాతల నుంచి మద్దతు పెరుగుతున్నది.
ఆదిలాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస బతుల విముకి ్తకోసం జరిగిన పోరాటాలు.. ఓ ప్రాంతం విముక్తి కోసం.. సామాజిక సమస్యల పరిష్కారానికి జరిగిన ఉద్యమాలను కండ్ల నిండారుగా చూశాం. కానీ.. దేశ చరిత్రలో తొలిసారిగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దీక్షలు చేయాల్సిన పరిస్థితిని కేంద్రం కల్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యల తెలంగాణ నుంచి.. రైతులను రాజును చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన చరిత్ర తెలంగాణది.
అటువంటి రాష్ర్టానికి మద్దతు ఇవ్వకుండా పండించిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం కొర్రీలు పెట్టడంపై రైతన్నలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలకు కేంద్రం చేయూతనివ్వకపోవడం.. ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి అన్ని సౌకర్యాలు కల్పించుకొని పంటను పండిస్తే వాటిని కూడా కొనుగోలు చేయబోమంటూ చేతులెత్తడంపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తన మొండి వైఖరి విడనాడాలి. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకోవడంతో పాటుగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ చేసే ఉద్యమంలో తాము భాగస్వాములవుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కేంద్రం యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, రాజేందర్ పాల్గొన్నారు.
వీరితోపాటు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ముత్యంరెడ్డి, వంగ రవీందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, భైంసా, కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు పిప్పెర కృష్ణ,సంతోష్‌లు, పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, నేరడిగొండ, తాంసి జడ్పీటీసీ సభ్యులు జాదవ్ అనిల్, తాటిపెల్లి రాజు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌తోపాటు టీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు జే.రవీందర్, మేడిపల్లి సంపత్, కొండల తిరుపతిరెడ్డి, మంద తిరుమల్ రెడ్డి, పెండ్రి రాజిరెడ్డి, ఉప్పుల కృష్ణ, ఈశ్వర్, మద్ది శంకర్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి పాల్గొన్నారు.
కేంద్రం గీ ధాన్యం విషయంల తెలంగాణ రైతులను తక్కువ అంచనా వేసుకుంటున్న ట్లున్నది. గనీ గతంల అయిన పంజాబ్ రైతుల ఉద్యమం కంటే ఎక్కనే అవుతది. జిల్లా నుంచే గాదు.. రాష్ట్రం నుంచి ఢిల్లీకి వోయి కొట్లాడుతున్న రైతులకు మేమంతా మద్దతు ఇస్తున్నం. అవసరమైతే ఏ సమయంలనైనా మా పొన్నారి గ్రామం మొత్తం రైతులం ఆడికి పోతం. ప్రధాని మోదీ ధాన్యం పంట మీద గింత చిన్నచూపు చూపిస్తున్నడంటే దేశ రైతులందరినీ అవమానించినట్లే భావించాల. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనాలి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రైతుపోరాటం కూడా చరిత్రలో నిలిచిపోతది.
– ముచ్చ రఘు, చిన్నకారు రైతు, పొన్నారి, తాంసి మండలం
నా పేరు ఉయికె బండు. సదూశాస్త్రం లేదు. భీంపూర్ మండలంల కొనాకు ( చివరన) ఉన్న కొత్త పంచాయతీ గుట్టమీద ఉన్న గోండు పల్లె టేకిడిరాంపూర్ మాది. మాకు ఐదెక్కర్ల భూమున్నది. తెలంగాణ సర్కారు అచ్చినంకనే మా చేతుల నాలుగు పైసలాడుతున్నయ్. సదులేకున్నా నేను టీవీల వార్తలు సూసి గా సెంటరోళ్లు వెడుతున్న అరిగోస గురించి తెల్సుకున్న. మా మండలం నుంచి సుకా కాస్తకార్లు (రైతులు) ఢిల్లీకి వోయిండ్రట. ఇగో గాల్లకు తోడుగ మేమంతా ఉన్నం. సెంటరోల్లు ఇయ్యాల్ల అరిగొనమంటరు.. రేపు ఇంకోటి కొనమంటరు.. గందుకే ఇపుడే పుండుమీద మందు ఎయ్యాల. ఇగ నేన్నొక్కన్నేగాదు.. మా పల్లెమీద సర్పంచి నుంచి అంతా ఢిల్లీకి పోతందుకు తయారుగున్నం.
అన్నం అంటే ధాన్యమే. ఇగ గసుంటి వరిని తీసిపారేసినట్లు మాట్లాడిన సెంటర్ మంత్రులకు అచ్చేటి రోజులల్ల అన్నం దొరకది. ఇప్పుడు ఢిల్లీల మా అందరు రైతుల కొసానకు దీక్షలు చేస్తున్న మా తోటి రైతులకు మేము అండగా ఉన్నం. మీరు ఎన్కకు రావద్దు. ఇగ ఈడ అన్ని గ్రామాలల్ల రైతు ఇంటికాడ కూడా ధాన్యం కొనాలని దీక్షలు మొదలయ్యేటి దినాలు దగ్గరవడ్తున్నయ్. బీజేపీ పెద్దలు ఇప్పటికైనా దిగిరాకుంటే ఇది పెద్ద కతవుతది. ఎట్లన్న విజయం రైతులదే అవుతది.
– అంగ రాజేశ్వర్, పాతతరం రైతు, దహెగాం, బజార్హత్నూర్ మండలం
వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తుంది. రైతుల జీవితాలతో ఆటలాడడం పక్కన పెట్టి పండించిన ప్రతి గింజనూ కేంద్రమే కొనాలి. పూర్తిగా పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ… అంబానీ, అదానీలకు దాసోహం అంటున్న కేంద్రంలోని బీజేపి సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడుతాం.
– నందిరామయ్య, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకుడు
సోన్, ఏప్రిల్ 11 : దేశానికి అన్నం పెట్టేది రైతే. మేం వరి పండించకపోతే ఏమి తిని బతుకుతరు. వరి రైతులను కేంద్రం అరిగోస పెడుతున్నది. పండిన ధాన్యం కొనుమంటే కొర్రీలు వెడుతున్నది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేసీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. కొనకపోగా.. కేంద్రమంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి రైతు బతుకును మరింత ఆగం చేస్తున్నరు. వరి సాగు చేస్తేనే కదా అందరూ అన్నం తినేది. ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకొని వడ్లు కొనాలి.
– ఎల్లయ్య, రైతు
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో న్యాయమున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొంటున్న కేంద్రం.. తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనదు. దేశంలోని ఒక్కో ప్రాంత రైతుకు ఒక్కో న్యాయమా..? యాసంగిలో వరి పంటనే వేయాలని, కేంద్రమే కొంటుందని బీజేపీ నాయకులు చెప్పారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో మేము కొనలేమని చేతులెత్తేశారు. ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రైతులకు విశ్వాసముంది. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పదు.
– నయీమొద్దీన్, రైతు, నిర్మల్
సోన్, ఏప్రిల్ 11 : ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని గొప్పలు చెప్తరు. కానీ.. తెలంగాణ సర్కారు రైతులకు చెప్పినవన్నీ చేసింది. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంటే మాలాంటి రైతులం పొలం సాగు చేసుకొని వరి పండిస్తున్నం. మాలాంటి రైతులను కేంద్రం చులకన చేసి మాట్లాడుతున్నది. వరి కొనమంటే కొనబోమని చెప్పడం రైతులకు నష్టం చేయడమే అవుతుంది. బీజేపీకి తగిన బుద్ధి చెప్తం.
– పోశెట్టి, రైతు, ముఠాపూర్
కోటపల్లి, ఏప్రిల్ 11 : దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రైతు దీక్షతో పోరు మరింత ఉధృతమైంది. తెలంగాణ రైతులపై చిన్నచూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు, రైతు నాయకులు ఢిల్లీ వచ్చి సైరన్ మోగించారు. రైతులకు అండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం ఆగదు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీలు.. నేడు రైతుల మోహం కూడా చూడడం లేదు. మాకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదు.
– మంత్రి రామయ్య, రైతు, కోటపల్లి
పార్టీ ఆదేశాలతో ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలను ఉధృతం చేశాం. బైక్ ర్యాలీలు తీశాం. రోడ్డుపై బైఠాయింపులు, నిరసన దీక్షలు కొనసాగించాం. కేంద్రం మొండి వైఖరి వీడాలి. దేశంలో ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం పాటించాలి. తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరి స్తున్న మోడీ సర్కారు ధాన్యం కొనాలి. లేకుంటే గద్దె దిగాలి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా ఉంటున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సీఎం వెన్నంటి ఉంటాం. ప్రభుత్వ విప్ సారథ్యంలో చెన్నూర్ నుంచి ఢిల్లీకి వచ్చాం.
– సతీశ్ రాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్