ప్రవహించిన వాగులు, చెరువులు
పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం
అయిజ, ఆగస్టు 30 : మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం తెల్లవారు జామున దాదాపు 3గంటలపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో మండలంలో పలుగ్రామాల వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. మున్సిపాలిటీ సమీపంలోని పోలోని వాగుకు భారీగా వరద నీరు చేరింది. అయిజ మున్సిపాలిటీలోని లోతట్టు కాలనీలలోకి వర్షం నీరు చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. అయిజ నుంచి చిన్న తాండ్రపాడు, పులికల్, ఉత్తనూర్ తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు నీటి మునిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిన్న తాండ్రపాడు, కేశవరం, నౌరోజీక్యాంపు, వేణిసోంపురం, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, నసనూర్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, వాహనాలు చిన్న తాండ్రపాడు రహదారిలో నిలిచిపోయారు. అలాగే టీటీదొడ్డి సమీపంలోని వాగుకు భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింధనూర్, టీటీదొడ్డి, కుటుకనూర్, కొత్తపల్లి, కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గంటల తరబడి వాహనాలు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీతోపాటు మండలంలో 40.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో నేపాల్ తెలిపారు. ఈ నెలలో భారీగా వర్షం కురవడంతో రైతులు సంబురపడ్డారు. వానకాలం సాగుకు ప్రస్తుతం కురిసిన వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మండలంలో 30. 2 మి.మీ వర్షం
మల్దకల్, ఆగస్టు 30 : మండలంలో ఆదివారం కురిసిన వర్షం 10.2 మిల్లీ మీటర్లుగా నమోదు అయిందని తాసిల్దార్ ఆజంఅలీ తెలిపారు.