రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్
గద్వాల,ఆగస్టు 30 : భారీ వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేయాలని రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్లను ఆదేశించారు. సోమవారం సీఎస్ హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు, డ్యాంలు నిండాయని అదే విధంగా రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ అధికారులందరూ హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.
మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శృతిఓఝా మాట్లాడుతూ జిల్లాలో వర్షాల కారణంగా చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలో టీంలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని 24గంటలు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు రఘురాంశర్మ, శ్రీహర్ష ఇరిగేషన్ అధికారులు శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.