
ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 29 : మన రైతులు పండించిన పంటలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న అన్నారు. బుధవారం పత్తి యార్డును సెక్రటరీ ఆర్.మల్లేశంతో కలిసి సందర్శించారు. పంటను యార్డుకు తీసుకవచ్చిన రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం పంటకు లభిస్తున్న ధర, అన్నదాతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఎంతో సారవంతమైన నేలలు ఉన్నాయన్నారు. రైతులకు సైతం సాగులో మంచి అనుభవం ఉండడంతో నాణ్యమైన పంట దిగుబడులు వస్తున్నట్లు తెలిపారు. పంటల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించడం, మార్కెట్లో ప్రతి పంటకు మద్దతు ధరకు మించి ధరలు పలుకుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం మార్కెట్ మంచి ధరల అడ్డాగా ఉందన్నారు. నాడు మిర్చి పంటకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ధర క్వింటాల్ రూ.22 వేలు పలికిందన్నారు. నేడు పత్తిపంటకు సైతం చరిత్రలో లేనివిధంగా క్వింటాల్ రూ.9 వేలు గరిష్ఠ ధర పలకడంతో రైతులకు కలిసి వచ్చిందన్నారు. రైతులకు సమస్య రాకుండా, సకాలంలో క్రయవిక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.