కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, ఆగస్టు 28 : సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభానికి పాఠశాలల ఆవరణ తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం పదో వార్డులోని కేజీబీవీ, గిరిజన బాలికల గురుకుల కళాశాల హాస్టల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు తరగతి గదులు వంటగదిని పరిశీలించారు. సెప్టెంబర్ 1న విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న ప్రతి పాఠశాలలో పారిశుధ్య చర్యలు, వంట గదులు, మరుగుదొడ్ల పరిశుభ్రత చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే విద్యా సంస్థల ప్రతినిధులతో ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి పాఠశాలకు రావాలన్నారు. పాఠశాల, కళాశాలలో శానిటైజర్ వాడాలని, భౌతికదూరం పాటించాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను తనిఖీ చేశారు. కార్యాలయంలో మిగిలిన పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. అందమైన మొక్కలను నాటాలని, త్వరలో ప్రారంభమయ్యే కలెక్టర్ కార్యాలయం అన్ని హంగులతో ముస్తాబు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నవిత, గోవర్ధన్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి యాదమ్మ, ఈఈ దేశ్యనాయక్, డీఈ దానయ్య, హార్టికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు.