హైదరాబాద్ నర్సింగ్ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ విద్యులత
గద్వాల, ఆగస్టు 28 : రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ నర్సింగ్ కళాశాల డిప్యూ టీ డైరెక్టర్ విద్యులత అన్నారు. జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నూతనంగా ప్రారంభించనున్న నర్సింగ్ కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులు పరిశీలించడానికి శనివారం ఆమె గద్వాలకు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి జిల్లా దవాఖానను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడున్న నర్సులు, వైద్యులు, సూపరింటెండెంట్, డీఎంహెచ్‌వోతో మాట్లాడా రు. దవాఖాన స్థాయిని 350 పడకలకు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. అనంతరం నర్సింగ్ కళాశాల కోసం డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది అద్దె భవనంలో వం ద మంది విద్యార్థులతో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి అ నుబంధంగా ఈ కాలేజీ కొనసాగుతున్నదని తెలిపారు. ఇంటర్లో బైపీసీ చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. త్వరలో మెడికల్ కళాశాల కూడా మంజూరయ్యే అవకాశం ఉన్నదన్నారు. వారి వెంట నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కమల, ప్రొఫెసర్ సత్యప్రియ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, డీఎంహెచ్‌వో చందునాయక్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ కిశోర్, జెడ్పీటీసీ రాజశేఖర్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, సోమనాద్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ భాస్కర్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.