
పాఠశాలల నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్ విడుదల చేసిన ప్రభుత్వం
మొదటి విడుతగా 50శాతం నిధులు రూ.రూ.84.40 లక్షలు విడుదల
జిల్లాలో 712 పాఠశాలలకు ఉపయుక్తం
యాదాద్రి భువనగిరి, జనవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భువనగిరి జిల్లాలో 163 ఉన్నత పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 481 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, జనరల్ కాంపోనెంట్ కింద మొత్తం రూ.84.40లక్షలను విడుదల చేసింది. పాఠశాలల మరమ్మతులు, పారిశుధ్యం, విద్యుత్ బిల్లులు, జాతీయ పండుగల నిర్వహణ, ప్రయోగశాల, కంప్యూటర్లు, డిజిటల్ తరగతుల నిర్వహణ, ఇంటర్నెట్ నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్‌ను వినియోగించుకోవచ్చు. కేటాయించిన నిధుల్లో 10శాతం స్వచ్ఛ కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా పనులకు సంబంధించి పాఠశాలల యాజమాన్య కమిటీలు తీర్మానం చేశాక ఎస్ఎంసీ ఛైర్మన్, హెచ్ఎంల జాయింట్ సంతకంతో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నిధుల కేటాయింపులు ఇలా…
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులు విడుదలవుతాయి. 1 నుంచి 30 మంది ఉన్న పాఠశాలలకు రూ.5వేలు, 30 నుంచి 100 మంది ఉన్న పాఠశాలలకు రూ.12,500 చొప్పున విడుదలయ్యాయి. 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.25వేలు, 251 నుంచి వెయ్యి మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.37,750 చొప్పున విడుదలయ్యాయి.