కామారెడ్డి టౌన్, జనవరి 28: జిల్లాలో అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 97 శాతం, రెండో డోసు 72 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. వైద్యులు, ఆర్బీఎస్కే సిబ్బంది సహకారంతో అర్హులందరికీ క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ వేయాలని సూచించారు. 15 నుంచి 17 ఏండ్లలోపు బాలబాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారిణి కల్పనా కాంటే, వైద్యాధికారులు పాల్గొన్నారు.
‘రాజీవ్ స్వగృహ’ను పరిశీలించిన కలెక్టర్
పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలన్నారు. ప్రతి ప్లాటుకు క్రమ సంఖ్య కేటాయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
ఈవీఎం గోదాము పనులను వెంటనే పూర్తి చేయాలి
ఈవీఎం గోదాము నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేయాలని ఆర్అండ్బీ ఏఈ రవితేజకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు ఉన్నారు.