
రద్దీకి తగ్గట్టు యాదాద్రిలో ఏర్పాట్లు
భక్తుల కోసం 60వేల లడ్డూలు
కొవిడ్ నిబంధనలుతప్పనిసరి
యాదాద్రీశుడిని దర్శించుకున్న అఖండ టీమ్
ఆలయ పునర్నిర్మాణం అద్భుతం : సినీ నటుడు బాలకృష్ణ
యాదాద్రి, డిసెంబర్ 27 : రాష్ట్ర ప్రజల ఇలవేల్పు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నూతన సంవత్సరానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. జనవరి ఒకటిన స్వామివారిని దర్శించు కోవాలన్నది అనేకమంది భక్తులకు సెంటిమెంట్‌గా ఉంటుంది. ఆ మేరకు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే బాలాలయంలో యాదాద్రీశుడి దర్శనభాగ్యం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. దర్శనాలు, పూజా కార్యక్రమాలషెడ్యూల్ను ప్రకటించారు. భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మరోవైపు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ సోమవారం యాదాద్రీశుడిని దర్శించుకున్నారు.అఖండ సినిమా విజయం నేపథ్యంలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నూతన ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్య పోతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం గొప్పదని, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని కీర్తించారు.
జనవరి 1వ తేదీన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి ఈఓ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జనవరి1న బాలాలయాన్ని ఉదయం 3గంటలకే తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. స్వామి ప్రసాద కౌంటర్లను ఉదయం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తెరిచి లడ్డూ, పులిహోర, అభిషేకం లడ్డూలు విక్రయించనున్నట్లు తెలిపారు. ఇందుకు గానూ 100గ్రాములు, అభిషేకం లడ్డూలను 60వేలు తయారు చేయడంతో పాటు పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శించుకోవాలని సూచించారు.
13నుంచి అధ్యయనోత్సవాలు
జనవరి 13నుంచి 18వ తేదీ వరకు స్వామి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జవనరి 13న వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి పురస్కరించుకుని బాలాలయంలో(తూర్పు ద్వారం), అనుబంధ ఆలయమైన పాతగుట్టలో ఉత్తర ద్వారం గుండా స్వామి వారు 6.49గంటలకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాలాలయంలో భక్తులతో నిర్వహించే సుదర్శన నారసింహహోమం, మొక్కు, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.