
డీఐజీ రంగనాథ్ నుంచి బాధ్యతల స్వీకరణ
నల్లగొండ జిల్లాకు తొలి మహిళా ఎస్పీ
రంగనాథ్‌కు ఘనంగా వీడ్కోలు
నీలగిరి, డిసెంబర్ 27 జిల్లా ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటివరకూ ఎస్పీగా కొనసాగిన డీఐజీ రంగనాథ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ అదనపు ఎస్పీగా పని చేసిన అనుభవం ఉండడంతో జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. 2009 బ్యాచ్‌కు చెందిన రెమా రాజేశ్వరి.. జిల్లాకు మొట్టమొదటి మహిళా ఎస్పీ కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న డీఐజీ రంగనాథ్‌కు జిల్లా పోలీసులు ఘనంగావీడ్కోలు పలికారు. పూల వర్షం కురిపించి, తాడుతో ఆయన వాహనాన్ని లాగి
అభిమానం చాటుకున్నారు.
సమర్థవంతంమైన ఆలోచనలు, అందరినీ సమన్వయం చేస్తూ ప్రజల్లో పోలీసుల గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసిన డీఐజీ రంగనాథ్ జిల్లా ప్రజల మదిలో చెరుగని ముద్ర వేశారని నల్లగొండ జిల్లా కొత్త ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం ఏఎస్పీ నర్మద అధ్యక్షతన నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ రంగనాథ్‌కు ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెమా రాజేశ్వరి మాట్లాడుతూ నల్లగొండ రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగానే కాకుండా పొరుగు రాష్ర్టాల సరిహద్దులు, నేరాల శాతం ఎక్కువగా ఉండే జిల్లా అని, అనేక సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ సుదీర్ఘకాలం ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ ఆయన పనితీరు, నిబద్ధ తకు నిదర్శనమన్నారు. రంగనాథ్ భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా రెమా రాజేశ్వరి రంగనాథ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
పోలీస్ సిబ్బంది అభిమానం..
వీడ్కోలు అనంతరం రంగనాథ్‌ను పోలీస్ సిబ్బంది జీపులో కూర్చోబెట్టి పూల వర్షం కురిపించారు. అనంతరం పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు కారును తాడుతో లాగి అభిమానాన్ని చాటారు. డీటీసీ ఎస్పీ సతీశ్ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, అనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, సురేశ్‌కుమార్, రమణారెడ్డి, మొగిలయ్య, సీసీ కార్తీక్, పోలీస్ అధికారుల సంఘం నాయకులు జయరాజ్, సోమయ్య, ఏఓ మంజుభార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్‌రావు, సబితారాణి, ఆర్ఐలు నర్సింహాచారి, స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, నర్సింహ, సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు గోపి, నిగిడాల సురేశ్, శంకర్‌రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఎంతో సంతృప్తినిచ్చింది : డీఐజీ రంగనాథ్
సుమారు నాలుగు సంవత్సరాలు జిల్లాలో పని చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని, మంచి అనుభవాలను మిగిల్చిందని డీఐజీ రంగనాథ్ అన్నారు. అందరి సమష్టితో సుదీర్ఘకాలం ఇబ్బందులు లేకుండా పనిచేయగలిగానని తెలిపారు. మంచి పోలీస్ అధికారి కావాలంటే మంచి వక్తగా సైతం మారాలని, మనలో ఉన్న ప్రతిభకు మరింత పదును పెడుతూ అందుకనుగుణంగా ఆలోచనా విధానం ద్వారా విజయాలను పొందాలని సూచించారు.