
కొత్తగూడెం, అక్టోబర్ 27 : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రత్యేక అధికారులు, వైద్య, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంటింటి సర్వే నిర్వహణలో వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అన్న విషయం ఆధార్‌కార్డుతో పరిశీలన చేయాలని, నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు గ్రామ, జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో కార్యదర్శులు, వీఆర్ఏ, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలతో మల్టీలెవల్ డిసిప్లినరీ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో 3లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, జిల్లా వైద్యాధికారి శిరీష, డీపీవో రమాకాంత్, జడ్పీ సీఈవో విద్యాలత పాల్గొన్నారు.
‘ట్రెస’ జిల్లా అధ్యక్షుడిగా భగవాన్‌రెడ్డి
అభినందించిన కలెక్టర్
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ట్రెస) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకులు రియాజ్, జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భగవాన్‌రెడ్డి, కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షులుగా గన్యా నాయక్, సీహెచ్ నాగరాజు, కోశాధికారిగా రంగా ప్రసాద్, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గ సభ్యులు కలెక్టర్ అనుదీప్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యవర్గాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి
జూలూరుపాడు/ చుంచుపల్లి, అక్టోబర్ 27 : పల్లెల్లో రెండోవిడత వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేయాలని జడ్పీ సీఈవో విద్యాలత పేర్కొన్నారు. జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రామారావు, పంచాయతీ కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు. చుంచుపల్లి మండల కేంద్రంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఒక టీమ్‌గా ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌ను నూరుశాతం పూర్తిచేయాలని సూచించారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ మౌనిక, సుజాతనగర్ పీహెచ్సీ వైద్యాధికారి నాగమణి, ఎంపీడీవో సకినాల రమేశ్, ఎంపీవో సత్యనారాయణ, ఏపీఎం రామకృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో సమావేశం
కొత్తగూడెం, అక్టోబర్ 27 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష జిల్లా ప్రోగ్రాం అధికారులతో బుధవారం సమీక్షించారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పోటు వినోద్, పీవో నాగేంద్రప్రసాద్, అడిషనల్ డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్, టీహబ్ కో ఆర్డినేటర్ భావ్‌సింగ్, డాక్టర్లు చేతన్, సుకృత, స్వాతిశ్రీ పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌పై అపోహలు పడొద్దు : కమిషనర్
పాల్వంచ, అక్టోబర్ 27 : వ్యాక్సినేషన్‌పై ప్రజలు ఎవ్వరూ అపోహలు పడొద్దని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు కాలనీలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ను ఆయన పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వ్యాక్సిన్ వేసుకునే వారు 9849905884 నంబర్‌కు తమ లొకేషన్‌ను వాట్సాప్ చేస్తే సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ల వివరాలను తెలియజేస్తామని చెప్పారు.