ప్రభుత్వ దవాఖానలో అన్నీ పరీక్షలు చేయాలి
వైద్యాధికారులు, సిబ్బందితో కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం
బెజ్జూర్, సెప్టెంబర్ 25 : ప్రసవమైన తర్వాత తల్లికి, శిశువుకు నిర్వహించాల్సిన అన్ని వైద్య పరీక్షలు ప్రభుత్వ దవాఖానలోనే నిర్వహించేలా చూడాలని వైద్య అధికారులు, సిబ్బందికి కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం ఆదేశించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా వైద్యాధికారి సహా సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లేబర్ రూమ్‌ను పరిశీలించారు. ఆపరేషన్‌కు వాడే పరికరాలను పరిశీలించారు. గడువు ముగిసిన పరికరాలు కనిపించడంతో వాటిని వెంటనే తొలగించాలని వైద్యాధికారి రుషికి సూచించారు. ఇంజక్షన్ లను ఎలా స్టెరిలైజేషన్ చేస్తున్నారని అడుగగా ఆటో క్లేవ్ పనిచేయడం లేదని వేడి నీటి ద్వారా శుద్ధి చేస్తున్నామని తెలిపారు. డెలివరీ కాగానే శిశువుకు నంజుతీసే మ్యూకస్ సక్కస్, తదితర పరికరాలను శుభ్రపర్చాలన్నారు. శిశువులకు విటమిన్ కే, బీడీఆర్ఎల్ టీకాలు ఇస్తున్నారా?అని అడిగారు. అవి సరఫరా కావడం లేదన్నారు. బయట నుంచి కొని శిశువులకు అందించాలని సూచించారు. అనంతరం రక్త, మూత్ర పరీక్షల రిపోర్టులు కచ్చితమైన రిజల్ట్‌తో ఉండాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో సుధాకర్ నాయక్, వైద్యాధికారులు రుషి, ముస్తఫా, హెచ్‌ఈవో కోటేశ్వర్, మలేరియా నివారణ టెక్నికల్ సూపర్ వేజర్ అశోక్, హెల్త్ సూపర్ వేజర్ రవిరాజ్, హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు, హెచ్వీ రేణుక, ఫార్మసిస్టు ఆయేషా తబస్సూం సిబ్బంది ఉన్నారు.