బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్
అధికారులకు ఆదేశాలు
గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరణ
వరంగల్, ఆగస్టు 23: గ్రీవెన్స్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్ అధికారులను అదేశించారు. సోమవారం గ్రీవెన్స్ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రజా విజ్ఞప్తులు, ఫైళ్ల నిర్వహణపై సమీక్షించారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న వినతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వినతుల వెల్లువ..
బల్దియా గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువలా వచ్చాయి. కాలనీల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కరించాలని పలు కాలనీల ప్రజలు వినతులు అందజేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు, భవన నిర్మాణ అనుమతుల మంజూరులో జాప్యం, నల్లా లేకున్నా పన్ను వస్తుందన్న సమస్యలను ప్రజలు అధికారులకు వివరించారు. శంభునిపేట ఇంటి నంబర్ 19-10-345 ఉన్న ప్రాంతంలో 20 రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని శామిన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 41వ డివిజన్ పరిధిలోని విశ్వనాథ కాలనీని గ్రీన్ జోన్‌గా ప్రకటించారని, 20 ఏళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని, రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని కాలనీ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ప్రశాంత్ నగర్ కాలనీలో అక్షర ఎన్క్లేవ్ సంస్థ తమ భూమిని ఆక్రమించి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నదని, వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు నాగరాజారావు అధికారులకు ఫిర్యాదు చేశారు. మట్టెవాడ ఇంటి నంబర్ 15-4-254 నుంచి 15-4-257 వరకు సైడ్ కాల్వలు, రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికుడు బాలరాజు వినతి పత్రం అందజేశారు. జవహర్‌నగర్ రింగ్ రోడ్డు సమీపంలో సిగ్మా జూనియర్ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నదని, చర్యలు తీసుకోవాలని జూలైవాడకు చెందిన భరత్ కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్‌లో డీఎఫ్‌వో కిశోర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ జోనా, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, ఈఈ, డీఈ, ఏసీపీ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
విభాగాల వారీగా..
టౌన్ ప్లానింగ్ విభాగానికి 20, ఇంజినీరింగ్ విభాగానికి 3, ప్రజారోగ్య విభాగానికి 1, పన్నుల విభాగానికి 3 వినతులు వచ్చాయి.