
హాజరుకానున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు
ఉదయం 11గంటలకు దాఖలు
నామినేషన్లకు ఇయ్యాల్నే ఆఖరు
ఇప్పటివరకు దాఖలు కాని నామినేషన్లు
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 22(నమస్తే తెలంగాణ);ఉమ్మడి జిల్లాతో కూడిన నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంగళవారం నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరు ముఖ్య నేతలు కలిసి నల్లగొండ కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించనున్నారు.
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సాగే నామినేషన్కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు హాజరుకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటల వరకు జడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న నల్లగొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవాలని అందరికీ సందేశం వెళ్లింది. ఇక్కడే బ్రేక్ ఫాస్ట్ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర ముఖ్యులంతా సమావేశం కానున్నట్లు తెలిసింది. అనంతరం పార్టీ అభ్యర్థితోపాటు మరో ఇద్దరు నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. మొత్తం మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ర్యాలీలూ, సభ ఉండబోదని, సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
ఇప్పటివరకు నామినేషన్లు నిల్.
ఈ నెల 16వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. సోమవారం వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. నేడు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. ఇవ్వాళ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు గడువు ఉంది. ఈ ఎన్నికల్లో 1271 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు కలిగి ఉండగా ఇందులో 1100 మందికి పైగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్, బీజేపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు కసరత్తు చేసేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ పెద్దగా ఆసక్తితో లేరని తెలిసింది. జిల్లా ముఖ్య నేతల మధ్యే ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎవరూ దీనిపై స్పందించేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఇక బీజేపీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఏకపక్ష బలం కలిగిన టీఆర్ఎస్ పార్టీ విజయం సునాయసం కానున్నది. నేడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనుండగా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇవ్వాళ నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండగా రేపు నామినేషన్ల పరిశీలన, ఈ నెల 25, 26 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల తుదిజాబితా వెల్లడించనున్నారు. పోటీలో ఎవ్వరూ లేకపోతే అదే రోజూ టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.