
సాగర్ జలాలతో పూర్తిస్థాయిలో నిండిన చెరువు
2500 ఎకరాలకు సాగు, 68 గ్రామాలకు తాగునీరుపుష్కలంగా మత్స్యసంపద మత్స్యకారులకు ఉపాధి
త్రిపురారం, నవంబర్ 22 : త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఉన్న చెరువు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మూడో పెద్ద చెరువుగా పేరుంది. సుమారు 1800 ఎకరాల విస్తీర్ణంలో 176 అడుగుల లోతులో ఉంది. ప్రస్తుతం ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. ఎడమ కాల్వ ద్వారా కృష్ణా జలాలతో చెరువును నింపుతుండడంతో నిండుగా కళకళలాడుతున్నది.
4 మండలాలకు తాగునీరు
నాగార్జునసాగర్ ఎడమకాల్వ నీటితో పెద్దదేవులపల్లి చెరువును నింపుతున్నారు. ఈ చెరువులోని నీటిని సేకరించి శుద్ధి చేసేందుకు ప్రత్యేక ట్యాంకులు ఇక్కడే నిర్మించారు. వీటి ద్వారా మిర్యాలగూడ, త్రిపురారం, నిడమనూరు, వేములపల్లి మండలాలకు చెందిన సుమారు 68 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. వర్షాకాలం నీటితో చెరువు నిండుతుండగా.. ప్రభుత్వం కూడా ఎడమ కాల్వ ద్వారా చెరువును నింపుతుండడంతో ఎల్లవేళలో చెరువులో నిండుగా నీరు ఉంటున్నది. ఫలితంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకాలేకుండా పోయింది.
2500 ఎకరాలకు సాగునీరు
పెద్దదేవులపల్లి చెరువు ద్వారా త్రిపురాంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. చెరువు వద్ద ఏర్పాటు చేసిన కామారెడ్డిగూడెం, దుగ్గేపల్లి లిఫ్టుల ద్వారా కామారెడ్డిగూడెం, దుగ్గేపల్లి, కంపాసాగర్, పెద్దదేవులపల్లి, పూసలపాడు గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నారు. దీంతో పాటు రిజర్వాయర్ వెనుక జలాల ద్వారా త్రిపురారం, అడవిదేవులపల్లి, నిడమనూరు మండలాల రైతులకు సాగునీరు అందుతున్నది.
300 మంది జాలర్లకు ఉపాధి
పెద్దదేవులపల్లి గ్రామంలో 800 జాలర్ల కుటుంబాలుండగా ఈ చెరువులో చేపలు పట్టడం ద్వారా 300 మంది జాలర్లు జీవనోపాధి పొందుతున్నారు. గ్రామంలో మత్స్యకారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ఇందులో సభ్యులుగా ఉన్న వారికి ఉపాధి చూపుతున్నారు. జిల్లాలోనే ఎక్కువ మంది సభ్యులున్న సంఘంగా పేరు పొందింది. ప్రభుత్వం కూడా ఉచితంగా చేపపిల్లలు వదులు తుండడంతో మత్స్యకారులు నిత్యం చేపలను పట్టి విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు.