
ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నిక
ధ్రువీకరణ పత్రం అందుకున్న సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు అభ్యర్థులే బరిలో నిలువడం ఎన్నిక లాంఛనమే అయ్యింది. కానీ, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సుఖేందర్‌రెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని శాసనమండలి ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, నవీన్‌రావు, ఎంఎస్.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత, సీఏం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూ శాసనమండలి సభ్యుడిగా బాధ్యతను సమర్ధవంతం నిర్వహించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.