20గేట్లు ఎత్తివేత
ఇన్‌ఫ్లో 63,563,అవుట్‌ఫ్లో 83,515 క్యూసెక్కులు
నీటినిల్వ 100.239 టీఎంసీలు
అయిజ, నవంబర్ 22: కర్ణాటకలోని ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద భారీగా వస్తున్నది. దీంతో ప్రాజెక్టు 20గేట్లు ఎత్తి దిగువకు 83,515 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. సోమవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 63,563క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 83,515 క్యూసెక్కులు నమోదైంది. 100.855టీఎంసీల సామర్థ్యం గల టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.239 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1632.84 అడుగులు ఉన్నట్లు టీబీబోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతోపాటు టీబీ డ్యాం ద్వారా వస్తున్న వరద తోడవడంతో ఆర్డీఎస్కు వరద వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 1,10,416 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 1,10,000 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 13.2అడుగుల మేర నీటిమట్టం ఉన్నది. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 416క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సుంకేసులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
రాజోళి, నవంబర్ 22: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటక పరిధిలోని ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తున్నది. సోమవారం 1,60,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 17గేట్లు తెరిచిన అధికారులు 1,58,530 క్యూసెక్కులను దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. 2,270క్యూసెక్కులను కేసీ కెనాల్‌కు వదిలినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.