సిట్టింగులకే మరో చాన్స్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం
జనవరి 4తో ముగియనున్న పదవీ కాలం
నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు
మెజార్టీ ఓటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పార్టీవారే
రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుపై గులాబీ పార్టీ ధీమా
ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రతిపక్ష పార్టీల సందిగ్ధం
ప్రతిపక్షాలు పోటీ చేసినా.. నామమాత్రమే
రంగారెడ్డి, నవంబర్ 21, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక ఏకపక్షం కానున్నది. టీఆర్ఎస్ అధిష్ఠానం సిట్టింగ్‌లకే మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజులనే అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు సమాచారం. వీరి పదవీ కాలం జనవరి 4తో ముగియనున్నది. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నేడు ఒక సెట్ నామినేషన్లు, రేపు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది. అధిక శాతం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. బరిలో దింపాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ పోటీ చేసినా నామమాత్రమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను నిర్ణయించింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీలకే మరో చాన్స్ ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు పేర్లను ఫైనల్ చేసింది. అయితే వీరిద్దరి ఎమ్మెల్సీ పదవీకాలం జనవరి 4తో ముగియనుండడంతో అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి వీరిద్దరికి అవకాశమిచ్చారు. అయితే నేడు వీరిద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేయనున్నారు. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు నేడు ఒక సెట్ నామినేషన్, రేపు మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. అంతేకాకుండా నేడు అభ్యర్థులకు పార్టీ బీఫామ్‌ను కూడా అందజేయనున్నది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పోటీపై ఇంకా సందిగ్ధమే కొనసాగుతున్నది. మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో ఎన్నికకు దూరంగా ఉండే ఆలోచనలో ప్రతిపక్షాలున్నట్లు సమాచారం. ఒకవేళ పోటీ చేసినా..నామమాత్రపు పోటీయే కానుంది. మెజార్టీ ఓటర్లు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీ విజయభేరి మోగించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
రెండు స్థానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా..
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ టీఆర్ఎస్ ఛేజిక్కించుకోనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించిన మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడం అధికార పార్టీకి కలిసిరానుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉండనున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది టీఆర్ఎస్ పార్టీకే చెందిన వారే ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నది. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండనున్నారు, ఎక్స్అఫిషియో సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీ వారే ఉండడం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఎదురులేదనేది స్పష్టమవుతున్నది. ఏదేమైనా మెజార్టీ ఓటర్లు ఉన్న నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకుగాను టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు ఉమ్మడి జిల్లా మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి ఆధ్వర్యంలో పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.
పోటీపై సందిగ్ధంలో ప్రతిపక్షాలు…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఖరారు చేయలేరు. అయితే టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీలనే మరోసారి బరిలోకి దింపగా, ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు ఏ ఎన్నిక జరిగినా గెలుపు టీఆర్ఎస్దే అన్న చందంగా ఎన్నికలు జరుగుతుంటే ప్రతిపక్షాల పరిస్థితి మాత్రం దిక్కుతోచని స్థితిలా తయారైంది. మెజార్టీ స్థానిక సంస్థల ఓటర్లంతా టీఆర్ఎస్ పార్టీ వారే ఉండడంతో పోటీ చేసినా నామమాత్రమేనని తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు పోటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఓటర్లున్నా, బీజేపీకి మాత్రం ఒక్క ఓటరు కూడా లేరు. దీంతో పరువు కాపాడుకునేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా బరిలో తమ అభ్యర్థిని దింపినప్పటికీ, బీజేపీ మాత్రం పోటీకి పూర్తిగా దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ వారే…
స్థానిక సంస్థల ఓటర్లకు సంబంధించి మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్ వారే ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయితే జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు 1179 మంది ఉండగా, వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుషులు-552 మంది ఓటర్లు, 627 మంది మహిళా ఓటర్లున్నారు. వీరిలో కార్పొరేటర్లు-310 మంది, కౌన్సిలర్లు-432, జడ్పీటీసీలు-33, ఎంపీటీసీలు-384 మంది ఓటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు-20 మంది ఉన్నారు. వీరిలో ఎక్స్అఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్ పార్టీవారు 19 మంది ఓటర్లు, జడ్పీటీసీలు-27 మంది ఉన్నారు. ఎంపీటీసీలకు సంబంధించి మొత్తం 384 మంది ఓటర్లుండగా రంగారెడ్డి జిల్లాలో 79 మంది ఓటర్లు, వికారాబాద్ జిల్లాలో 151 మంది ఓటర్లున్నారు. కౌన్సిలర్లకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో 57 మంది ఓటర్లుండగా, రంగారెడ్డి జిల్లాలో 42 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలోనూ మెజార్టీ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.