
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు
వైద్యసేవల కోసం క్యూకడుతున్న రోగులు
పెరిగిన ప్రసవాల సంఖ్య
కేసీఆర్ కిట్, అమ్మఒడికి ఆదరణ
సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ వరకు 5972 కాన్పులు
సిద్దిపేట, నవంబర్ 21: సర్కారు దవాఖానలకు ఆదరణ పెరుగుతున్నది. ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న జనాలే.. ‘వెళ్తే సర్కారు దవాఖానకే వెళ్లాలి..’ అని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో దవాఖానల్లో వసతులు కల్పిస్తూ, మెరుగైన వైద్యసేవలు అందించడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అమ్మఒడి, కేసీఆర్ కిట్ అందించడంతో పాటు బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేలను అందిస్తుండడంతో గర్భిణులు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అక్టోబర్ వరకు 5972 ప్రసవాలు జరిగాయి.
తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తల్లీబిడ్డల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యే క దృష్టి పెట్టడంతో మతా శిశు మరణాల సంఖ్య కూడా తగ్గింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వ దవాఖానల్లో 5972 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. దీనికి తోడు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ దవాఖానల్లో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండడంతో అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చా యి. సిద్దిపేట జిల్లాతోపాటు మెదక్ జిల్లా రామాయంపేట, సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలకు చెందిన వారు సైతం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ దవాఖానకు డెలివరీల కోసం వస్తున్నారు. ఇక్కడ మెరుగైన సేవలు అందుతుండడంతో నిత్యం దవాఖానలో ఓపీ పేషెంట్ల సంఖ్య పెరిగి రద్దీగా మారుతున్నది. జిల్లాలో సిద్దిపేటతోపాటు గజ్వేల్, దుబ్బాక, చేర్యాల దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నుం చి అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 5972 ప్రసవాలు కాగా, వీటిలో 2623 మందికి నార్మల్ డెలివరీలు కాగా, 3349 మందికి సీజేరియన్ అయ్యాయి. 121 మంది కరోనా పేషెంట్లకు డెలివరీలు చేశారు. కేసీఆర్ కిట్లు నవంబర్ 10 వరకు 5162 కిట్లు బాలింతలకు అందజేశారు. కిట్ల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది.