
చెరుకు క్రషింగ్‌కు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ సిద్ధం..
ఈ నెల చివరిలోగా ప్రారంభించే అవకాశం
బాయిలర్‌కు పూర్తయిన పూజలు..
పలువురు రైతులతో ముందస్తు అగ్రిమెంట్..
ప్రతి రోజు 5 వేల టన్నుల చెరుకు క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు
జహీరాబాద్, నవంబర్ 21 : చెరుకు రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం యంత్రాలు సిద్ధం చేయడంతో చెరుకును తరలించేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ట్రైడెంట్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేయలేదు. దీంతో, సాగు చేసిన పంటను రైతులు ఇతర ఫ్యాక్టరీలకు తరలించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి క్రషింగ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, ఈ నెల చివరి వరకు చెరుకు క్రషింగ్ ప్రారంభించేలా బాయిలర్‌కు పూజలు కూడా చేశారు. ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల చెరుకును క్రషింగ్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకోగా, ప్రతి రోజూ 5 వేల టన్నులు క్రషింగ్ చేసే అవకాశం ఉంది. చెరుకు రికవరీపై రైతులకు మద్దతు ధర ఇస్తామని యాజమాన్యం తెలుపుతుంది.
జహీరాబాద్‌లో అధికంగా సాగు..
జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 10 లక్షల టన్నుల చెరుకు సాగు చేస్తున్నారని అధికారులు తెలిపారు. జోన్ పరిధిలో అగ్రిమెంట్, నాన్ అగ్రిమెంట్ చెరుకు సాగులో ఉండగా, పలువురు రైతులు ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోరు. ఏ పరిశ్రమ ఎక్కువ ధర ఇస్తే అక్కడికి పంటను తీసుకెళ్తారు. అయితే, ఒక ఎకరాలో చెరుకును సాగు చేయాలంటే రూ.45 వేలు ఖర్చు అవుతుందని, డీఏపీ, యూరియా, ఎరువుల ధరలు భారీగా పెరిగినా మద్దతు ధర పెంచడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరుకును అధికంగా జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్ మండలాల్లో సాగు చేస్తున్నారు. గతంలో ట్రైడెంట్ పరిశ్రమ టన్నుకు రూ. 2950 చెల్లించేది. అదే కర్ణాటక, మహారాష్ట్రలో టన్నుకు రూ.3500 చెల్లించడంతో అధిక శాతం రైతులు అక్కడి పరిశ్రమలకు పం టను తరలించారు. ఎకరానికి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుండగా, సంవత్సరానికి ఒకే పంటగా చెరుకును సాగు చేస్తారు. అదే వాణిజ్య, ఇతర పంటలను రెండు పంటలుగా పండిస్తారు.
ముడి సరుకుతో కర్మాగారాలకు లాభం
పరిశ్రమలు చక్కెర అమ్మకాల లాభాలను రైతులకు పంచాలి, కానీ అది అమలు జరగడం లేదు. చెరుకు గానుగ ద్వారా వచ్చే వ్యర్థాలు, మొలాసిస్, బెగాస్కు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. ఈ వ్యర్థాల లాభాలలో తమకూ వాటా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జహీరాబాద్ ట్రైడెంట్ పరిధిలోని చెరుకు గానుగకు సిద్ధంగా ఉంది. రాష్ర్టానికి సంబంధించిన మద్దతు ధర ప్రోత్సాహకం రద్దయ్యాక కేంద్రం ఎఫ్ఆర్పీ (ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్) విధానాన్ని అమల్లోకి తెచ్చి 9.5 శాతం రికవరీ కలిపి ధరను నిర్ణయించింది. కేంద్రం ఎస్ఎంపీ (స్టాట్యుటరే మినిమం ఫ్రైస్) ధరను ప్రకటించేది. రాష్ట్రం మద్దతు ధరతో పాటు చెరుకు పన్ను రూపేణ పొందే డబ్బును రైతులకే ఇచ్చేది. కాగా, 2002కు ముందు 8.5శాతం చొప్పున టన్ను చెరుకు గానుగాడిస్తే 85 కిలోల చక్కెర ఉత్పత్తి రికవరీపై మద్దతు ధర ప్రకటించేవారని రైతులు వివరించారు.
గతంలో 9.5 శాతం రికవరీ పై రూ.2,950
చెరుకు రైతులకు 9.5 శాతం లెక్కన చక్కెర రికవరీపై టన్నుకు రూ.2950 మద్దతు ధరను ట్రైడెంట్ గతంలో ప్రకటించింది. జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రికవరీ శాతం అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కెర పరిశ్రమలో 9.5 శాతం కంటే అధికంగా గతంలో రికవరీ వచ్చింది . ఇక్కడ సాగు చేసే చెరుకులో అధికంగా చక్కెర ఉత్పత్తి కావడంతో ఇతర పరిశ్రమలు రైతులకు అధిక ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
మద్దతు ధర ప్రకటించాలి
ట్రైడెంట్ పరిశ్రమ చెరుకుకు మద్దతు ధర ప్రకటించేలా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో అన్ని విధాలుగా ధరలు పెరిగిపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట ఉత్పత్తి వ్యయంతో పాటు కూలి, రవాణా ఖర్చులు పెరిగాయని మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
క్రషింగ్‌కు ఏర్పాట్లు
జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న చెరుకును క్రషింగ్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కొత్తూర్(బి) గ్రామం లో ఉన్న ట్రైడెండ్ చక్కెర ఫ్యాక్టరీలో ఈ నెల చివరి వరకు చెరు కు క్రషింగ్ ప్రారంభించేందుకు పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు చెరుకును ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. జోన్ పరిధిలో చెరుకును క్రషింగ్‌కు పలువురు రైతులతో పరిశ్రమ అధికారులు అగ్రిమెంట్లు చేసుకున్నారు. చెరుకు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు పొలంలో ఉన్న చెరుకును క్రషింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
-రాజశేఖర్, కేన్ అసిస్టెంట్ కమిషనర్ సంగారెడ్డి