
పట్టాలిచ్చినా పట్టువదలని అటవీశాఖ
అనుమతి లేకుండా రెవెన్యూ శాఖ పట్టాలు
ఇండ్లు కడుతుంటే ఫారెస్ట్ శాఖ మోకాలడ్డు
గుడిసెలు.. రేకుల షెడ్డూల్లోనే నివాసాలు
ప్రభుత్వాలకు విన్నవించినా దశాబ్దాలుగా సమస్య
ఎర్రగట్టు బొల్లారంలో శాశ్వత గృహాలు కరువు
ఉమ్మడి రాష్ట్రంలో అధికారుల నిర్వాకం
కొల్లాపూర్‌రూరల్, నవంబర్ 21: మండల కేంద్రానికి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న బొల్లారం గ్రామం ఒకప్పుడు పచ్చటి పంట పొలాలతో కళకళలాడేది. గ్రామస్తులు ఏడాదిలో మూడు పంటలు పండించేవారు. శ్రీశైలం జలాశయం నిర్మాణం వీరి బతుకులను ఛిద్రం చేసింది. ముంపుగ్రామాల్లో బొల్లారం కూడా ఒకటి కావడంతో అధికారులు అక్కడినుంచి గ్రామస్తులను 1981లో తరలించారు. ఇండ్లకు బదులు ఇండ్లు, భూములకు బదులు భూములు ఇస్తామని నచ్చజెప్పడంతో గ్రామస్తులు వారి మాటలు నమ్మి అక్కడినుంచి మొలచింతలపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని ఎర్రగట్టు బొల్లారం వద్ద అప్పట్లో 135ఎకరాల విస్తీర్ణంలో భూములను సాగుచేసుకోవడానికి పట్టాలు ఇచ్చారు. సాగుభూములకు దగ్గరగా ఎర్రగట్టు వద్ద 202 కుటుంబాలకు ఇండ్ల స్థలాలను కేటాయించారు. పట్టాలు కూడా ఇచ్చారు. కానీ ఊరు తరలించేందుకు ముందే కొందరు భూమిలేని పేదలు పోడుభూముల్లో వ్యవసాయం చేస్తుండేవారు. దీంతో అధికారులు వారికి సాగుభూములు ఇవ్వకుండా మొండిచేయి చూపారు. అయితే రెవెన్యూశాఖ నుంచి పట్టాల రూపంలో అప్పట్లో లబ్ధిపొందినవారిలో 60శాతం ఎస్సీలు, 20శాతం బీసీలు, మరో 20శాతం ఎస్టీలు ఉన్నారు.
1981, మే 22న పట్టాల పంపిణీ
1981 మే 22న రెవెన్యూ అధికారులు అప్పట్లో ముంపు నిర్వాసితులకు అధికారికంగా ఇండ్ల పట్టాలు, స్థలాలను కొలిచిచ్చారు. ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయం అందిస్తామని అప్పట్లో అధికారులు ప్రభుత్వాదేశానుసారం నమ్మబలికారు. తప్పని పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు తాత్కాలికంగా పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగించారు. రెండు మూడేండ్లు, దశాబ్దాలపాటు ఎదురుచూపులే తప్ప నేటికీ శాశ్వత నివాసాలకు మాత్రం నోచుకోలేకపోతున్నారు. నేటికీ తమను అన్ని రాజకీయపార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కరించేనాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.
మోకాలడ్డుతున్న అటవీశాఖ
ముంపు నిర్వాసితులకు రెవెన్యూశాఖ పట్టాలు ఇచ్చింది. కానీ అట్టి భూములు అటవీశాఖ పరిధిలోకి వస్తాయని ఫారెస్టు అధికారులు వాదిస్తున్నారు. అటవీశాఖ నుంచి అనుమతిలేకుండా పట్టాలిచ్చారని, అవి చెల్లవని అక్కడి గ్రామస్తులను శాశ్వత నిర్మాణాలకు తావివ్వకుండా ఫారెస్టుశాఖ అడ్డుకుంటున్నది. అటవీశాఖ అనుమతి లేకుండా ప్రభుత్వం రెవెన్యూ ద్వారా పట్టాలు ఇప్పించడంతో అవి తమ పరిధిలోకి వస్తాయని అటవీ శాఖ ఆం క్షలు విధించింది. ప్రస్తుతం 108కుటుంబాలు అక్కడ నివాసముంటున్నాయి. ఉపాధి అవకాశాలకు తావులేకుండా నట్టడవి లో సాగుభూములకు దూరంగా ఇండ్ల స్థలాలు చూపడంతో బొ ల్లారం గ్రామస్తులు ఉపాధి అవకాశాలు లేక తల్లడిల్లి పోతున్నా రు. అదేవిధంగా ముంపు నిర్వాసితులకు సాగుభూముల పట్టా లు ఇవ్వకపోవడంతో బతుకుదెరువు కోసం అవస్థలు పడుతున్నారు. కానీ, అటవీశాఖ మాత్రం తాము పెట్టిన ఆంక్షలను సడలించడం లేదు. అధికారులను ఎంత ఒప్పించినా చట్టప్రకారం శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు వీలులేదని పట్టుబట్టింది. ప్రభుత్వపరంగా ఆ గ్రామానికి ఏకోపాధ్యాయ పాఠశాల మం జూరైంది. పాఠశాల భవనానికి కూడా అప్పట్లో నిధులు మంజూరయ్యాయి. కానీ, అటవీ ఆంక్షల కారణంగా వచ్చిన నిధులు తిరిగివెళ్లాయి. కొన్నేండ్లపాటు పూరి గుడిసెల్లోనే అక్కడి విద్యార్థులకు బోధన జరిగింది. కాలక్రమేణా ప్రభుత్వం అక్కడున్న పాఠశాలను కూడా ఎత్తివేసింది. ప్రస్తుతం గ్రామంలో మిషన్‌భగీరథ నీటి ట్యాంకులు శాశ్వత నిర్మాణానికి నోచుకున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..
శ్రీశైలం తిరుగు జలాల ముంపునకు గురైనప్పటి నుంచి కూలీనాలీ చేసుకుంటున్న వారిని అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతంనుంచి ఖాళీచేయించేందుకు వెనుకాముందు ఆలోచించకుండా ఎర్రగట్టు వద్ద ఉన్న స్థలంలో ప్లాట్లు ఇప్పించారు. అందులో ఉచితంగా ఇండ్లు కట్టిస్తామన్నారు. భూమిలేనివారికి భూములిస్తామన్నారు. కానీ, నేటికీ ఏ ఒక్కహామీ లేదు సరికదా సొంత ఖర్చులతో ఇండ్లు నిర్మించుకోవాలన్నా నిబంధనలు అడ్డువేస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీ శాఖ ఆంక్షలు గట్టిగా ఉండటంతో అధికారులు గ్రామస్తులను అక్కడినుంచి ఇతర ప్రాంతానికి తరలించి ఇండ్లు కట్టిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఏండ్లుగా చెబుతూనే ఉన్నారు. గత అనుభవాల కారణంగా వారి ప్రతిపాదనను గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. ఒకప్పుడు అందరి మాటలు నమ్మి మోసపోయాం ఇక ఎవరినీ నమ్మే పరిస్థితి లేదని, మా తాతలు తండ్రులు ఇక్కడే చనిపోయారు. మేం కూడా జీవితాంతం ఇక్కడే ఉండి చస్తాం తప్ప ఇతర చోటికి వెళ్లమని గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. ఏండ్ల తరబడి పట్టాలు ఇచ్చిన స్థలంలోనే గుడిసెలు వేసుకుని బతుకుతున్నాం. ఇక్కడే అలవాటు పడ్డాం మళ్లీ ఇక్కడినుంచి మరోచోటికి వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు. పట్టాలు ఇచ్చిన చోటనే ఇండ్లు కట్టిస్తే బాగుంటుంది. ఇండ్ల స్థలాలకు దగ్గరగా పోడు భూములను సాగుచేసుకుంటున్నాం. వేరేచోటికి వెళ్లలేమంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షలు విధిస్తూ పట్టువదలని ఫలితంగా బొల్లారం గ్రామస్తులకు శాశ్వత గృహనిర్మాణం ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం ఎర్రగట్టు బొల్లారంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. సంబంధిత అధకారుల సమన్వయంతో సమస్యపై చర్చిస్తే సమస్యలు సమసిపోయే అవకాశంలేకపోలేదు.
భూములు ఇవ్వడం లేదు
మా తాత ముత్తాతలనుంచే బొల్లారం ముంపునకు గురైనదని అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి మీకు భూమి, నష్టపరిహారం, ఉచితంగా స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామన్నారు. చెప్పినట్టుగానే భూములున్న వారికి నష్టపరిహారం ఇచ్చారు. కానీ, ఇండ్లు కోల్పోయిన వారికి స్థలాల పట్టాలిచ్చారు.. ఇండ్లు నిర్మించలేదు. మేం సొంతంగా కట్టుకుంటే ఫారెస్టు అధికారులు అడ్డుపడుతున్నారు. కూలీనాలీ చేసుకునే మేము 60కుటుంబాలు మాత్రమే ఎర్రగట్టు బొల్లారంలో నివాసముంటున్నాం. నష్టపరిహారం తీసుకున్న వారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.