నిజామాబాద్ రూరల్, నవంబర్ 21 : మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. చెరువుల్లో చేప పిల్లలను పెంచి ఉపాధి పొందుతున్న మత్స్యకారులకు, చెక్‌డ్యాముల నిర్మాణంతోనూ లబ్ధి చేకూరుతున్నది. వరద నీటిని నిల్వ చేసి వ్యవసాయ భూములకు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చెక్ డ్యాముల్లోనూ మత్స్యకారులు చేపలను వేటాడుతూ ఉపాధి పొందుతున్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకులకొండూర్ గ్రామశివారులో పూలాంగ్ వాగుపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.4.50 కోట్లు వెచ్చించి చెక్డ్యామును నిర్మించింది. ఈ ఏడాది వానకాలం ప్రారంభానికి ముందే చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో 3 వేల మీటర్ల వరకు వలయకారంలో నీరు నిల్వ ఉంటుంది. వానలు సమృద్ధిగా కురవడంతో పూలాంగ్ వాగు ఉధృతంగా ప్రవహించింది.
ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువులు అలుగుపారడంతో ఆ నీటిలో కొట్టుకొచ్చిన చేపలు కొండూర్ చెక్డ్యాములోకి చేరాయి. ఇటీవల నీటిమట్టం తగ్గడంతో మత్స్యకారులు రెండు రోజులుగా చెక్డ్యాములో చేపలను వేటాడుతున్నారు. మూడు నుంచి ఎనిమిది కిలోల బరువున్న ఒక్కో చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. కిలోకు రూ.150 చొప్పున విక్రయించారు. రూ.15వేల ఆదాయం సమకూరిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మా ణం కారణంగా వరద ప్రవాహంలో చేపలు వెళ్లిపోవని మత్స్యకారులు పేర్కొన్నారు. చెరువులతోపాటు చెక్‌డ్యాముల్లోనూ చేపల వేటతో తమకు ఉపాధి లభిస్తున్నదన్నారు.
చెక్‌డ్యాం నిర్మాణం ఫలితమే..
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో గ్రామశివారులోని వాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేశారు. చెక్‌డ్యాం నిర్మాణంతో వ్యవసాయభూములకు నీరందడంతోపాటు భూగర్భ జలమట్టం పెరిగింది. మత్స్యకారులకూ ఉపాధి లభిస్తున్నది. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు గ్రామస్తులమంతా రుణపడి ఉంటాం.