
రాష్ర్టానికి ఏం చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి యాత్ర?
తెలంగాణ ప్రజల పన్నులతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే పల్లెల్లో కొత్త వెలుగులు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్
ఖమ్మం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు.. తెలంగాణ గ్రామీణాభివృద్ధికి కేంద్రం మొండిచేయి చూపింది.. ఇక్కడి ప్రజలకు ఏం చేశారని కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా యాత్రలు చేపడుతున్నారు”..? అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ విభాగంలో నిర్వహించిన ‘భారత్ కి ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో ఆయన మాట్లాడారు. రూ.3 లక్షల కోట్లను తెలంగాణ ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రజలకు ఏం చేశారని కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపడుతున్నారని, అది ప్రజలను మోసం చేసే యాత్ర అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఇక్కడి ప్రజలు చెల్లించే పనులతో కేంద్రం బీజేపీ పాలిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన పంచాయతీరాజ్ విభాగంతో నిర్వహించిన ‘భారత్ కి ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. రాష్ట్రంలో జరుగుతన్న అభివృద్ది పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర కాదనీ, అది ప్రజలను మాయ చేస్తున్న యాత్రలని విమర్శించారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్ర నిధులతోనే రోడ్లు వేయించారన్నారు.
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి..
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండే రోడ్లు నిర్మించాలని మంత్రి అజయ్ అన్నారు. రఘునాథపాలెం మండలంలో కేవలం రూ.2 కోట్లతో 426 రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎంజీఎస్‌వై పథకంతో రాష్ర్టానికి ప్రయోజనాలు లేవన్నారు. ఒక నియోజకవర్గానికి కేవలం 25 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించడం సరికాదన్నారు. జిల్లాలో కేంద్రంలోని 115 రోడ్లకు మాత్రమే నిధులు కేటాయించడం దారుణమన్నారు. ఎంపీ నామా నాగేశ్వరారవు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుంటేనే గ్రామస్తులు బాగుంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. సెమినార్లో ఇంజినీరింగ్ అధికారులు కొత్త విషయాలను నేర్చుకుని రోడ్ల నిర్మాణంలో వాటిని వినియోగించాలన్నారు. సమావేశంలో శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, పంచాయతీరాజ్ సీఈ సీతారాములు, ఈఈ జీవీ చంద్రమౌళి, డీఈ శ్రీనివాసరావు, డీఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.