రైతుల అభ్యున్నతికి మేలు
పంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన
నూతన వ్యవసాయ విధానాలపై సమాచారం
జిల్లాలో పూర్తి అయిన 97 రైతు వేదికలు
ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షలు
వికారాబాద్, నవంబర్ 20 : రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ అందజేస్తుండగా, రైతుబంధుతో ఆదుకుంటున్నది. గతంలో పంటల సాగు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చెప్పేవారు లేక అన్నదాతలు ఇబ్బందులు పడేవారు. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ కొన్ని గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదికను నిర్మించేలా చర్యలు చేపట్టారు. ఏ పంటలు పండిస్తే లాభం, ఏ పంటలకు ఏ మందులు పిచికారీ చేయాలి, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఎంత ? ఇలాంటి సమస్యలపై రైతులు చర్చించుకోవడానికి ఉపయోగపడేలా రైతు వేదికలు నిర్మించారు.
వికారాబాద్ జిల్లాలో 97..
జిల్లా వ్యాప్తంగా 97 రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వికారాబాద్ నియోజకవర్గంలో 31, పరిగిలో 20, కొడంగల్ 22, తాండూరు 24 రైతు వేదికలు నిర్మించారు. వికారాబాద్ మండలం మైలార్‌దేవరంపల్లి క్లస్టర్ రైతు వేదికను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని రైతు వేదికలు ప్రారంభోత్సవాలు జరిగి వినియోగంలోకి వచ్చాయి. ఒక్కో రైతు వేదికకు రూ.22లక్షలు మంజూరు కాగా.., ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.10లక్షలు, ప్రభుత్వం రూ.12లక్షలు మంజూరు చేసింది. జిల్లాలో 97 రైతు వేదికలకు మొత్తం రూ.21.34కోట్లు పూర్తి చేసింది. దీంతో రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు సాగుపై ప్రతి మంగళవారం, శుక్రవారాలు అవగాహన కల్పిస్తున్నారు. మద్దతు ధర, నూతన వ్యవసాయ విధానాలపై సమాచారం అందిస్తున్నారు.
మండలాల వారీగా..
ధారూరులో 7, మోమిన్‌పేట 5, వికారాబాద్ 4, బంట్వారం 2, కోట్‌పల్లి 3, మర్పల్లి 5, నవాబుపేట 5, పరిగి 6, దోమ 5, పూడూరు 5, కుల్కచర్ల 4, తాండూరు 7, పెద్దేముల్ 6, బషీరాబాద్ 6, యాలాల 5, బొంరాస్‌పేట 6, కొడంగల్ 8, దౌల్తాబాద్‌లో 8 చొప్పున మొత్తం 97 రైతు వేదికలు ఉన్నాయి.
రైతులందరికీ ఒకే చోట అవగాహన
రైతు వేదికల నిర్మాణంతో పని భారం తగ్గింది. ఇందులో సమావేశాలు నిర్వహించి రైతులందరికీ ఒకే చోట అవగాహన కల్పిస్తున్నాం. రైతులు కూడా సమావేశాలకు హాజరై సలహాలు పాటిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు ఇక్కడి నుంచే పంపిణీ చేస్తున్నాం. పంటల వివరాల నమోదు చేశాం. రైతులు సైతం నేరుగా వచ్చి సమస్యలు విన్నవిస్తున్నారు.