
నల్లగొండ, నవంబర్ 20 : 2019-2021కు సంబంధించిన మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో 2021-23 కొత్త మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్ శాఖ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించి దుకాణాల కేటాయించింది. ఆయా జిల్లాలో డివిజన్ల వారీగా ప్రతి విడుతలో 40 దుకాణాల చొప్పున దరఖాస్తు దారులను ఆహ్వానించి డ్రా నిర్వహించారు. ఏ దుకాణానికి ఎన్ని దరఖాస్తులు పడ్డాయో అని చూసి అన్ని టోకెన్లు ఒకే బాక్సులో వేసి డ్రా తీసి వాళ్ల పేర్లు ప్రకటించి ఆ దుకాణాలను వారికి కేటాయించారు. కొత్త మద్యం పాలసీ కింద డిసెంబర్ 1 నుంచి కేటాయించనున్నారు. డ్రాలో దుకాణం దక్కిన వారు సంతోషంతో కేరింతలు వేయగా దక్కని వాళ్లు విచారంతో వెనుదిరిగారు. దుకాణం దక్కిన వారు లైసెన్స్ ఫీజులో 1/6 వంతు చెల్లించి ప్రొవిజనల్ లైసెన్స్‌ను పొందినట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
భువనగిరి అర్బన్ :యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పట్టణంలోని రావి భద్రారెడ్డి గార్డెన్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. మొత్తం 82 మ ద్యం దకాణాలకు 1,379 దరఖాస్తులు వచ్చాయి.
మొత్తం దుకాణాల్లో 16 మహిళలు,66 దుకాణాలు పురుషులకు వచ్చాయి.
గౌడ్స్‌కు-21 దుకాణాలు కేటాయించగా 322, ఎస్సీలకు-7 కేటాయించగా 112, ఎస్టీలకు1 కేటాయించగా 15 దరఖాస్తులు, ఓపెన్ కేటగిరికి-53 దుకాణాలను కేటాయించగా 930 దరస్తులు వచ్చాయి.
భువనగిరి దుకాణం నంబర్-1కి లాటరీ తీయగా చౌటుప్పల్ చెందిన జాల జంగయ్యకు వచ్చింది. రామన్నపేట సర్కిల్లోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో గల షాపు నంబర్-2, 3కు డ్రా తీయగా హయత్‌నగర్‌కు చెందిన డెంకిని వసంతకు రెండు దుకాణాలు వచ్చాయి.
భువనగిరి పట్టణంలో దుకాణం నంబర్ 5,6 భువనగిరి పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ దిడ్డికాడి భగత్‌కు, ఆయన సోదరుడు దిడ్డికాడి నర్సింగ్‌రావుకు నంబర్ 3కు వచ్చింది అన్నదమ్ములకు మూడు దుకాణాలు వచ్చాయి.
యాదగిరిగుట్టలో దుకాణం నంబర్-3 భువనగిరి మండల వడాయిగూడెం గ్రామానికి చెందిన తండ్రి పబ్బాల ఉప్పలయ్యకు, యాదగిరిగుట్టలో దుకాణం నంబర్-2 పబ్బాల తులసీదాస్ దక్కించుకున్నారు. వీరిద్దరూ తండ్రీకొడుకులు. కార్యక్రమంలో భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి కృష్ణప్రియ, సీఐ నాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండలో..
నల్లగొండ : పట్టణంలో గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో డ్రా నిర్వహించగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ్దిశాఖ రాష్ట్ర కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హాజరయ్యారు. నల్లగొండ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపా రులు పెద్ద సంఖ్యలో వచ్చి టెండర్లు వేశారు. ప్రధానంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కువగా దరఖాస్తులు వేసి దుకాణాలు దక్కించుకున్నారు. జిల్లాలో 155 దుకాణాలకు 4,079 దరఖాస్తులు వచ్చాయి
నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు వెయ్యి మంది వచ్చి టెండర్లు వేయగా అందులో 35 దుకాణాలకు పైగా దక్కించుకున్నట్లు సమాచారం.
గౌడ్స్‌కు 34 దుకాణాలకు కేటాయించగా 772 దరఖాస్తులు, ఎస్సీ 14దుకాణాలకు 339 దరఖాస్తులు, ఎస్టీ 4 దుకాణాలకు 165 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ డిప్యూటీ కమి షనర్ అంజన్ రావు, సూపరింటెండెంట్ హిమశ్రీ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేటసిటీ : జిల్లాలో 99వైన్ దుకాణాలు స్థానిక త్రివేణి ఫంక్షన్హాల్లో కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి సమక్షంలో డ్రా తీశారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 99 దుకాణాలకు 3,017 దరఖాస్తులు అందాయి
జిల్లాలో 18 మంది మహిళలు, 81మంది పురుషులు దుకాణాలు దక్కించుకున్నారు.
గౌడ్స్ 27 దుకాణాలకు 718 దరఖాస్తులు, ఎస్టీలకు 3 దుకాణాలకు 90 దరఖాస్తులు, ఎస్సీలకు 10 సంబంధించి 326 దరఖాస్తులు, ఓపెన్ కేటగిరిలో 59 దుకాణాలు 1,883 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలోఆంధ్రాకు చెందిన ఆరుగురు వ్యాపారులు దుకాణాలు దక్కించుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్ , సీఐలు తిరుపతిరెడ్డి, బాలాజీనాయక్, రాజ్యలక్ష్మి, శ్యాంసుందర్, శ్రీనివాస్, ఎక్సైజ్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.