
‘సెంట్రల్’ హోదా దక్కేనా..?
సంగారెడ్డి జిల్లా జైలులో సిబ్బంది కొరత
సామర్థ్యం 260.. ప్రస్తుతం ఉన్నది 711 ఖైదీలు
33 మంది వార్డర్లతో మూడు షిఫ్టుల్లో విధులు
తాజాగా ఇద్దరు జైలర్ల బదిలీ
కంది, నంవబర్ 20 : పెరుగుతున్న ఖై దీల సంఖ్యతో పోలిస్తే సరిపోను సిబ్బంది లేక సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని జిల్లా జైలులో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇక్క డ 200 నుంచి 240 వరకు ఖైదీలు శిక్షను అనుభవించారు. ఇందులో మూడు బ్యారక్‌లు గోదావరి, కృష్ణ, సరస్వతీలో ఖైదీలను ఉంచేవారు. మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కోర్టులకు సంబంధించిన కేసుల్లో ఖైదీలకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్లు జరిగేవి. కానీ, కొద్ది నెలల నుంచి సంగారెడ్డి జిల్లా జైలులో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లి 8, 9, 10, 11 కోర్టు కేసుల అడ్మిషన్లు కూడా ఇక్కడికే వస్తుండడంతో జైలులో ఒక్కసారిగా ఖైదీల సంఖ్య రెండింతలు పెరిగింది. జిల్లా జైలు కావడంతో ఇక్కడి సిబ్బంది అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వహిస్తున్నా, పెరుగుతున్న ఖైదీల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేరు.
260 నుంచి 711కు పెరిగిన ఖైదీలు..
సంగారెడ్డి జిల్లా జైలులో గతంలో ఉన్న మూడు బ్యారక్‌లలో మొత్తం 260మంది ఖైదీలు ఉండేందుకు సరిపడా వసతులున్నాయి. ప్రస్తుతం, సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లికి కోర్టు కేసులకు సంబంధించిన శిక్ష పడిన ఖైదీలు కూడా ఇక్కడికి రావడంతో వారి సంఖ్య 711కు చేరింది. ఇందులో 36 మంది మహిళా ఖైదీలతో పాటు 7 మంది పిల్లలు ఉన్నారు. ఖైదీలు పెరిగిన నేపథ్యంలో వారిని ఉంచేందుకు గతంలో వైద్యశాల నిర్వహించిన ప్రాణహిత బ్యారక్‌ను కూడా వాడుతున్నారు. కాగా, ఖైదీలను నియంత్రించేందుకు అవసరమైన సిబ్బంది కొరత ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం, కేవలం 33మంది జైలు వార్డర్లతో పాటు ఇద్దరు సబ్ జైలర్లు, ఇద్దరు జైలర్లు, సూపరింటెండెంట్ ఉన్నారు. సిబ్బందిని పెంచితే జైలులో ఎలాంటి లోటుపాట్లు లేకుం డా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో కంది జైలును సెంట్రల్ జైలుగా మార్చాలనే ప్రతిపాదన చేయగా, అది ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. జైలులో సిబ్బందిని పెంచే పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఇటీవల జైలును సందర్శించిన రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ ఎన్. మురళీబాబు తెలిపారు.