
ఆర్గానిక్ పద్ధతిలో కోళ్ల పెంపకం.. గుడ్లు, మాంసం ఉత్పత్తి..
స్వయం ఉపాధితో రాణిస్తున్న యువకుడు..
మొదట్లో భారీగా నష్టాలు.. పట్టువిడవకుండా ప్రయత్నం..
ప్రముఖ నగరాల్లో బ్రాంచులు..
సంవత్సరానికి రూ. 2.50 కోట్ల టర్నోవర్..
యువరైతు గోమారం అచ్యుత్‌రెడ్డి సక్సెస్ స్టోరీ
మనోహరాబాద్, నవంబర్ 20;లక్ష్యాన్ని ఎంచుకోవడం.. ఎన్ని అవంతరాలు వచ్చినా తట్టుకొని విజయం సాధించడం ఆత్మవిశ్వాసంతో పాటు స్వశక్తిపై నమ్మకం ఉన్న వారికే సాధ్యం అవుతుంది. ఎంత దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అని అంటున్నాడు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెంది గ్రామానికి చెందిన అచ్యుత్‌రెడ్డి. సాధారణంగా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఐదెంకలో, ఆరంకెలో జీతం తీసుకుని హాయిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ అచ్యుత్‌రెడ్డి మాత్రం ఇంజినీరింగ్ పట్టా చేతిలో ఉన్నా.. ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపులేదు. తన ఆలోచనలు అన్నీ వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఉండేవి. దీంతో సేంద్రియ పద్ధతిలో నాటుకోడి గుడ్లు, మాంసం ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అందించడం మొదలు పెట్టాడు. మొదట్లో కష్టనష్టాలను ఎదుర్కొన్నా అనతికాలంలోనే లాభాల బాట పట్టాడు. నేడు తనతో పాటు అనేక మందికి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించి ఉపాధి కల్పిస్తున్నాడు.
2015లో ప్రారంభమైన ప్రయాణం..
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెంది గ్రామానికి చెందిన గోమారం అచ్యుత్‌రెడ్డి ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్‌ను పూర్తి చేశాడు. చదివింది ఇంజినీరింగ్ అయినా వ్యవసాయ రంగంపై చాలా ఆసక్తి ఉండేది. 2015లో తన తండ్రి గోమారం నర్సింహారెడ్డి (మాజీసర్పంచ్ ) అనారోగ్యానికి గురవడంతో సొంత గ్రామానికి చేరుకున్నాడు. తమ పొలంలోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇంటి చుట్టూ తిరిగే పెరటి కోళ్ల మాదిరి నాటు కోళ్లను పెంచి గుడ్లను ఉత్పత్తి చేయాలని యోచించాడు. ఏ జాతి కోైళ్లెతే మంచి ఫలితాలు ఇస్తాయో అన్వేషించాడు. గోమారంలో తనకున్న 10 ఎకరాల్లో 4 ఎకరాల విస్తీర్ణంలో 2015లో షెడ్డును ఏర్పాటు చేశాడు. మొదట 500 ఆసీస్ జాతి కోళ్లను కొనుగోలు చేశాడు. కోళ్ల పెంపకంపై పూర్తి అవగాహన లేకపోవడంతో అవి వివిధ రోగాల బారిన పడి మృతిచెందడంతో నష్టపోయాడు. అయినా, నిరుత్సాహ పడకుండా మరో 500 కోళ్లను కొనుగోలు చేశాడు. వాటిని ఎలాంటి మందులు లేకుండా, కేవలం ఆరుబయట తిరుగుతూ ప్రకృతిలో దొరికే ఆహారాన్ని తిని పెరిగేలా చర్యలు తీసుకున్నాడు. అలా ఉత్పత్తి అయిన గుడ్లను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అందజేస్తున్నాడు.
ఆన్లైన్ విక్రయం..
అచ్యుత్‌రెడ్డి ఆర్గానిక్ గుడ్లను వి నియోగదారులు స్వాగతించడం మొదలు పెట్టారు. ఫోన్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఇంటికి వెళ్లి ఇచ్చేవాడు. కాగా మారుతున్న టెక్నాలజీని వినియోగించుకొని ‘న్యూట్రిఫ్రెష్’ సంస్థ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. దీంతో గుడ్లు కావాల్సిన వారు నేరుగా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. పెద్ద నగరాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి ప్రసుత్తం సంవత్సరానికి రూ. 2.50 కోట్ల టర్నోవర్‌తో దూసుకెళ్తున్నాడు.
కోడిమాంసం ఉత్పత్తి..
హోల్‌సెల్ ధరలోనే కంపెనీ టు కస్టమర్‌కు ఆర్గానిక్ గుడ్లను విక్రయించడంతో మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు వినియోగదారులు నాటు కోడి మాంసాన్ని సైతం ఉత్పత్తి చేయాలని అచ్యుత్ రెడ్డిని ప్రోత్సహించడంతో పక్కా నాటు కోడి మాంసాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. కోడి మాంసాన్ని తక్కువ ధరకే కంపెనీలోనే శుభ్రం చేసి, కాల్చి, కావాల్సిన విధంగా కట్ చేసి ఇస్తున్నాడు. హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
షెడ్డు.. ఆహారం…
కోళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ పూర్తిగా పెరటి కోళ్ల మాదిరిగా పెరిగేందుకు ఏర్పాట్లు చేశాడు. 4 ఎకరాల విస్తీర్ణంలో కోళ్లు బయటకు వెళ్లకుండా 9 అడుగుల ఎత్తు ఫెన్సింగ్ వేయించాడు. 10 వేల కోళ్లు ఫ్రీ రేంజ్లో తిరిగే విధంగా షెడ్స్, ఫీడింగ్, స్టోరేజ్ కోసం గోదాం నిర్మించాడు. కోళ్లు పరిసరాల్లో ప్రకృతి సిద్ధంగా దొరికే చిన్న చిన్న పురుగులు, మూలికలను ఆహారంగా తీసుకుంటాయి. షెడ్డులో పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సిద్ధం చేసిన దాణాను కూడా అందిస్తున్నారు.
అవార్డులు..
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ గ్లో బల్ జ్ఞాన్ ప్రతిష్ట సంయుక్తంగా కేవీ కే రైతు మిత్ర సౌజన్యంతో సూర్యా పేటలో నిర్వహించిన రైతు సమా వేశంలో మెదక్ జిల్లా నుంచి అచ్చు త్ రెడ్డి ఎంపికయ్యాడు. రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా పుడమి పుత్ర అవార్డును స్వీకరించాడు. అంతేకా కుండా ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి సేవా పురస్కార్ 2021 అవార్డును విజయశాంతి అందజేశారు.