
ఖమ్మం ఏఎంసీలో పత్తి, మిర్చికి రికార్డుస్థాయి ధర
క్వింటా పత్తి రూ.8,400, క్వింటా మిర్చి 19,525
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: సుదీర్ఘకాలం తరువాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు తెల్ల బంగారం (పత్తి), ఎర్ర బంగారం (మిర్చి) ధరలు మెరిశాయి. ఏసీ రకం తేజా మిర్చిపంటకు జాతీయస్థాయిలో ఖమ్మం మార్కెట్లోనే రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పత్తి ధరల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ ఏడాది భారత పత్తి సంస్థ (సీసీఐ) క్వింటా పత్తికి రూ.6 వేల మద్దతు ధర ప్రకటించిన విషయం విదితమే. అయితే తెలంగాణ పంటకు జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో సీజన్ ప్రారంభం నుంచే క్వింటా రూ.7 వేల నుంచి మొదలైంది. పంట చేతికి వచ్చే సరికి రూ.8 వేలు దాటింది. దీంతో రైతులకు ధర కలిసి వచ్చినట్లయింది. తాజాగా శుక్రవారం ఉదయం జరిగిన ఈ బిడ్డింగ్‌లో ఖరీదుదారులు పోటీ పడడంతో గరిష్ఠ ధర రూ.8,400 పలికింది. ఖమ్మం మార్కెట్‌కు వచ్చే మరో ప్రధాన పంట తేజా రకం మిర్చి. నిరుడు ఇదే మార్కెట్లో ఏసీ రకం మిర్చికి రికార్డుస్థాయిలో క్వింటాకు రూ.22 వేలు పలికి వ్యాపారులతోపాటు అధికారులు, అన్నదాతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సరిగ్గా ఏడాది తరువాత శుక్రవారం మార్కెట్లో జరిగిన జెండాపాటలో క్వింటాకు రూ.19,525 పలికింది. గుంటూరు మార్కెట్లో రూ.19,500 ధర పలుకగా.. వరంగల్ మార్కెట్లో రూ.17,300 మాత్రమే పలికింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఖమ్మం మార్కెట్లోనే అత్యధిక ధర పలికినట్లయింది. మార్కెట్లో పంటలకు మంచి డిమాండ్ రావడం, పంట ఉత్పత్తులు పెరుగుతుండడంతో చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న శుక్రవారం క్రయవిక్రయాలను పరిశీలించారు. సెక్రటరీ మల్లేశం, గ్రేడ్-టూ అధికారి బజార్ పాల్గొన్నారు.