నేటి నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ
24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ
డిసెంబర్ 10న ఓటింగ్.. 14న కౌంటింగ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి
సిద్దిపేట, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగనుండగా, నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 24న నామినేషన్ల పరిశీలన, 26వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్నది. డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెదక్ కలెక్టర్ హరీశ్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటు వేయనుండగా, మొత్తం 1027 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. నోటిఫికేషన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సందడి నెలకొనగా, ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా, ప్రస్తుత స్థానిక సంస్థల పదవుల్లో 90శాతానికి పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకపక్షం కానుంది.
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి నేడు(మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెదక్ కలెక్టర్ హరీశ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి ప్రోటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి పదవీ కాలం జనవరి 4న ముగియనున్నది. ఈ ఎన్నికతో పాటు రాష్ట్రంలో ఖాళీ అవుతున్న శాసనమండలి స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 10న విడుదలైంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాలోని ఒక స్థానానికి ఎన్నిక జరుగనున్నది. ఈ ఎన్నికల్లో 1027 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించకుంటారు. ఇప్పటికే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, జిలా అధికార యంత్రాంగంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాల్సిందిగా కోరారు. స్థానిక సంస్థలకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబితాపై ఈ నెల 20 వరకు ఫిర్యాదు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో రాజకీయ సందడి
ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వెలువడడంతో ఒక్క సారీగా రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం ఖాయం. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఏ అభ్యర్థిని నిర్ణయిస్తే, ఆ అభ్యర్థిని గెలిపించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్కు ఉమ్మడి మెదక్ జిల్లా కంచుకోటగా ఉంది. ప్రస్తుత స్థానిక సంస్థల్లో 90శాతానికి పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. జిల్లాలో తామున్నామంటూ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనా శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం. ఆయా పార్టీలో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాల్‌రెడ్డితో పాటు మరికొంత మంది ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పార్టీకి చేసిన తమ సేవలను మంత్రులకు వివరిస్తున్నారు. తాము పార్టీ కోసం ఎలా కష్టపడ్డామో వివరించే ప్రయత్నాలు చేయడంతో పాటు తమకు ‘ఒక్కసారి అవకాశం ఇప్పించండి’ అని వేడుకుంటున్నారు. అంతిమంగా సీఎం కేసీఆర్ ఎవరిని నిర్ణయిస్తే వారికి అందరం మద్దతుగా ఉండి భారీ మెజార్టీ గెలిపిస్తామంటున్నారు.
1027 మంది ఓటర్లు ..
శాసన మండలికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీటీసలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1027 ఓటర్లున్నారు. డిసెంబర్ 10న పోలింగ్‌కు సంగారెడ్డిలో టీఎన్జీవో భవనం, మెదక్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, డిసెంబర్ 14న మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాలట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలి. అంతర్గత సమావేశాలకు 200మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా ప్రజలు హాజరు కావొద్దని, బైక్, కార్ల ర్యాలీలకు అనుమతి లేదు. మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. సభలు, సమావేశాలకు ఇక్కడి నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు ఖర్చులకు సంబంధించి కొత్తగా తీసిన బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వాలి. ఒకే ఖాతా ద్వారా ఎన్నికలకు సంబంధించి ఖర్చులు చేయాలి.