కొల్చారం, నవంబర్ 15: రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు రైస్‌మిల్లర్లను హెచ్చరించారు. ఎనగండ్ల, రంగంపేటలోని రైస్‌మిల్లులను సోమవారం సందర్శించగా రైతులు రైస్‌మిల్లర్లు తమ ధాన్యం అన్లోడ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. దీంతో తహసీల్దార్ జిల్లా ఫౌరసరఫరాల అధికారితో ఫోన్లో మాట్లాడారు. మం డల పరిధిలోని 11 రైస్‌మిల్లులకు ధాన్యం దించుకోవడా నికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు మిల్లర్లు తమకు కేటాయించిన మేరకు మాత్రమే ధాన్యం తీసుకుంటామన్నారు. దీంతో తహసీల్దార్ రైస్‌మిల్లర్లతో మాట్లాడుతూ అవసరమైన గోదాం వసతులు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిస్తే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తప్పవన్నారు. తహసీల్దార్ వెంట గిర్దావర్ శ్రీహరి, ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి, రైతులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దశంకరంపేట, నవంబర్ 15: గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఐకేపీ ఏపీఎం గోపాల్ అన్నారు. మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి, కమలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే సమయంలో ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలన్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్ ధాన్యానికి రూ.1960, కామన్‌గ్రేడ్ ధాన్యానికి 1940 రూపాయలు చెల్లిస్తామన్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
చిన్నశంకరంపేట, నవంబర్ 15: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మెదక్ ఆర్డీవో సాయిరాం నిర్వాహకులకు సూచించారు. ఆయన మండల పరిధిలోని గవ్వలపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సాయిరాం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు
నిజాంపేటలో..
నిజాంపేట, నవంబర్ 15: రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యంలో మట్టి పెళ్లలు,తాలు గింజలు లేకుం డా చేసి,నాణ్యత ప్రామాణాలు పాటించాలని మండల ఏవో సతీష్ అన్నారు. నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు.ధాన్యం తేమశాతం 17 లోపు ఉండేట్లు సహకరించాలని రైతులకు సూచించారు.కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బాబు, పీఏసీఎస్ సీఈవో శోభారాణి , ఏఈవో శ్రేయ, రైతులు ఉన్నారు.