
కొనుగోలు కేంద్రాల వద్ద దౌర్జన్యం
కండ్ల ముందే ధాన్యం రాశులు చెల్లాచెదురు
అడ్డుకున్న రైతులపై కర్రలు, రాళ్లతో దాడి
అన్నదాతల నిలదీతతో ఉక్కిరిబిక్కిరైన బీజేపీ నేతలు
నల్లగొండ, నీలగిరి, నల్లగొండ రూరల్, నవంబర్ 15 : అన్నదాతపై బీజేపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. రాళ్లు, రౌడీషీటర్లతో తెగబడ్డారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చెల్లాచెదురు చేస్తూ అరాచకం చేశారు. పలుకరింపు ముసుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై వాలిన బండి ముఠా.. రైతులు నిలదీయడంతో తట్టుకోలేకపోయింది. యాసంగి ధాన్యం కొనలేమంటూ.. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడమెందుకని అన్నదాతలు ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరై.. అసహనంతో దాడులకు దిగింది. మీడియా, పోలీసులు, అన్నదాతకు అండగా నిలిచిన టీఆర్ఎస్ నాయకులపైనా రాళ్లు రువ్వి రక్తం కండ్ల చూసింది. ఆగ్రహానికి గురైన రైతాంగం నల్లగొండ నుంచి సూర్యాపేట వరకూ అడుగడుగునా బండి బ్యాచ్‌ను అడ్డుకున్నది. నల్లజెండాలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించింది. అంతిమంగా పాచిక పారని సంజయ్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం తోకముడవక తప్పని పరిస్థితిని ఏర్పడింది.
సజావుగా సాగుతున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పర్యటనపై జిల్లా రైతాంగం తిరగబడింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కొర్రీలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ రైతులు ఎదురుతిరిగారు. సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగిన బండి పర్యటనలో అడుగడుగునా నిరసనల హోరు కనిపించింది. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పర్యటన వద్దంటూ అడ్డగించారు. నల్లజెండాలు, చెప్పులతో బండి గో బ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. ధాన్యం కొంటారా.. కొనరా అని ప్రశ్నించిన రైతులు, టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో అడ్డుకున్న రైతులు
సూర్యాపేట, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర నల్లగొండ జిల్లాలో సాగింనంత సేపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాయంత్రం సూర్యాపేట జిల్లాలోకి అడుగు పెట్టిన బండికి చేదు అనుభవం ఎదురైంది. బండి సంజయ్ కాన్వాయ్ ఎక్కడ ఆగినా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. చిల్లేపల్లి, నేరేడుచర్ల, మర్రికుంట, గడ్డిపల్లిల్లో గ్రామాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. చిల్లేపల్లి నుంచి పెన్‌పహాడ్ మండలం జానారెడ్డినగర్‌కు వరకు ఎక్కడా ఒక్క నిమిషం కూడా ఆగకుండా పలాయనం చిత్తగించారు. చిల్లేపల్లి బ్రిడ్జిపై ధాన్యం ట్రాక్టర్లు ఉంచి రైతులు బైటాయించారు. సంజయ్ మిర్యాలగూడ దాటి అటువైపుగా వస్తున్నారని సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు బలవంతంగా రైతులను వాహనాల్లో ఎక్కించుకొని వెళ్లారు. అనంతరం ఏ గ్రామం మీదుగా బండి కాన్వాయ్ ప్రయాణిస్తే అక్కడ రైతులు రోడ్డు పక్కకు వచ్చి దాడులకు యత్నించారు. దీంతో పలు చోట్ల కాన్వాయ్‌లోని వాహనాల అద్దాలు పగిలాయి. తదనంతరం పెద్ద ఎత్తున పోలీసులు కాన్వాయ్ వెంట ఉండి పోలీసు వలయంలోనే ప్రయాణించారు.
గడ్డిపల్లిలో ధాన్యమే లేదు.. వచ్చిన బీజేపీ నేతలు గడ్డిపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు బండి సంజయ్ రాగా అక్కడ ధాన్యం లేదు.. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకునేందుకు రైతులు కూడా లేకపోవడంతో ఒక్క నిమిషంలోనే పయనమయ్యారు.
కేంద్రం ధాన్యం ఎందుకు కొనదు..?
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనడంలేదు. ధాన్యం కొననని కేద్ర ప్రభుత్వం ఒక వైపు చెబుతుండగా, రాష్ట్రంలో బీజీపీ నాయకులు మాత్రం ధాన్యం కొనుగోలుచేస్తుండగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంబయ్ మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కు మద్దతు ధర ఇవ్వడంనే దని విమర్శిస్తున్న సంజయ్ నీకు కేంద్రం పై నమ్మకం ఉంటే దానిని మెప్పించి దొడ్డు ధాన్యం కొనేమే విధంగా అనుమతి తీసుకు రా…రైతులలపై ప్రేమే ఉంటే గతంలో మాదిరిగా రైతుల ధాన్యం కొనుగోలు చేసే విధంతా అనుమతి తీసుకురా..అప్పడు మాత్రమే మీ పాలపై రైతులకు నమ్మకం ఏర్పడుతుంది. కేంద్రం చెపేది ఒక మాటయితే..రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక మాట చెబుతున్నారు. దీనితో రైతులు అయోమయంలో పడిపోతున్నారు. కేంద్రంపై వత్తిడి తెచ్చి మద్దవతు ధరకు రైతులను నుంచి ధాన్యం కొనుగోలు చేసినటటట్లయితే ఈ బాధలే రైతులకు ఉండవు. ఇప్పటి కైన సంబయ్ కేంద్రాన్ని ఒప్పించు.దొడ్డు ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూడాలి.
-మండల వెంకన్న, బొమ్మకల్, మాడ్గులపల్లి మండలం
నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని ఆర్జాల బావిలో ప్రతి సీజన్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 1.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తారు. రోజూ పది లారీలకు పైగా ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తారు. 17శాతం తేమ ఉంటేనే ధాన్యం సేకరణ జరుగుతుంది. కానీ అవేమీ పట్టించుకోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి బీజేపీ కార్యకర్తలతో కార్లలో వచ్చి ఇక్కడ రచ్చ రచ్చ చేశారు. కేంద్రం ధాన్యాన్ని కొంటామని చెప్పినా రాష్ట్రమే కొనడం లేదని రైతులకు తప్పుగా చెప్పారు. దీంతో రైతులు మిల్లుల్లోని ధాన్యం ఎఫ్‌సీఐ ఎందుకు తీసుకోవడం లేదని కొందరు రైతులు ప్రశ్నించారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో తీసుకొని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. గోబ్యాక్ సంజయ్ అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు బండికి చెప్పులు చూపించి కోడి గుడ్లు విసరడంతో బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో రైతులు ఆ దాడికి వణుకుతూ టెంకలు పెట్టుకోగా ఒకరిద్దరికి గాయాలయ్యాయి. వెంటనే బండి సంజయ్ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు.
రాళ్లదాడితో చెల్లాచెదురైన ధాన్యం కుప్పలు
కొనుగోలు కేంద్రంలో కుప్పగా పోసిన ధాన్యం బీజేపీ కార్యకర్తల రాళ్లదాడి చెల్లాచెదురైంది. ఆ ధాన్యాన్ని మళ్లీ కుప్ప పోసేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నేలపై, పట్టాల కింద ధాన్యం పడిపోవడంతో కొంత మేర నష్టం జరిగింది.
భారీగా మోహరించిన పోలీసులు
బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఆర్జాల బావి కొనుగోలు కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 14 మంది సీఐలు, ఎస్ఐలు, 25 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తం 250 మంది బందోబస్తు నిర్వహించారు. అంతకుముందు ఎస్పీ రంగనాథ్ ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి సూచించారు. సంజయ్ రాక ముందు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని నిర్వాహకులకు సూచించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
నల్లగొండ, నవంబర్ 15 : కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేసి వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు పల్లి రామరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ డిమాండ్ చేశారు. ఆర్జాల బావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించి వెళ్లిన అనంతరం టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. బండి సంజయ్ రైతుల్లో అలజడి రేపి బీజేపీ కార్యకర్తలతో రాళ్లదాడి చేయించాడని విమర్శించారు. కార్యక్రమంలో అభిమన్య శ్రీనివాస్, మారగోని గణేశ్, జెర్రిపోతుల భాస్కర్, బొర్ర సుధాకర్, ఆలకుంట్ల మోహన్ బాబు, దొడ్డి రమేశ్, టీఆర్ఎస్వీ నేతలు జిల్లా శంకర్, కట్టా శ్రీను, నాగార్జున పాల్గొన్నారు.
నాన్‌లోకల్ బీజేపీ కార్యకర్తలతో దాడులు
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 15 : బండి సంజయ్ పర్యటనలో ఆయన వెంట అంతా నాన్‌లోకల్ కార్యకర్తలే ఉన్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు గుర్తించారు. మిర్యాలగూడకు వచ్చిన బండి సంజయ్‌ను రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. యాసంగిలో కేంద్రమే ధాన్యం కొనాలని, ఆ మాట చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ సమాధానం చెప్పకపోగా బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వేముపల్లి మండలం బుగ్గబాయిగూడేనికి చెందిన మోదుగు సైదిరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. మిర్యాలగూడలో పనిచేస్తున్న ఓ జర్నలిస్టు కన్నుపై బలమైన గాయం తగిలింది. అనవసరంగా రెచ్చగొడుతున్న బీజేపీ శ్రేణులను ఆపేందుకు ప్రయత్నిస్తున్న వాడపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన బాటిల్ ముక్కుకు తగలడంతో గాయపడ్డారు.
బీజేపీ ఉద్ధరించేదేమీ లేదు..
మాది మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్. నేను కౌలుకు ఎనిమిది ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. కేసీఆర్ సార్ దయ వల్ల మాకు ఏ ఇబ్బందులూ లేవు. ఈ సారి వరికి మంచి దిగుబడి పండింది. రూ.1800 మద్దతు ధర వచ్చింది. ఇప్పటికే మూడు లోడులు అమ్మిన. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకా అన్ని బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కొత్తగా మమ్మల్ని ఏదో ఉద్దరిస్తామని వచ్చింది. మేము ధాన్యం పండిస్తే కొనేది ఎవరు.. కేంద్రమే కదా. మరి తెలంగాణలో పండించిన ధాన్యం మాత్రమే కొనకుండా ఇబ్బంది పెట్టడం ఎందుకు. బండి సంజయ్ వచ్చి కేంద్రమే మద్దతు ధర ఇస్తుంది.. కానీ రాష్ట్రమే ఇవ్వడం లేదని అనడం తప్పు. మా రాష్ట్రం అన్ని ఇస్తున్నది. ముందు ధాన్యం కొంటవా లేదా చెప్పు. కొనకపోతే తెలంగాణ ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో తర్వాత తెలుస్తుంది.
-అవిరెండ్ల నరేశ్ ఆగామోత్కూర్, మాడ్గులపల్లి