పరిగి/షాద్‌నగర్, నవంబర్ 13 :రాష్ట్ర సర్కార్ చేపట్టిన పట్టణ ప్రగతి ఫలితంగా పారిశుధ్య నిర్వహణలో ఉమ్మడి జిల్లాకు అవార్డుల పంట పండింది. వికారాబాద్ మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో చోటు దక్కించుకోగా.. కొడంగల్, తాండూరుతోపాటు రంగారెడ్డి జిల్లాలోని మరో తొమ్మిది మున్సిపాలిటీలు ఓడీఎఫ్ ప్లస్‌లో స్థానం సంపాదించాయి. బహిరంగ మలమూత్ర విసర్జన రహితం, ఇంటింటికీ మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లు తదితర సదుపాయాలను ఆధారంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటిస్తుంది. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13467 ఇండ్లు ఉండగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉన్నది. అలాగే 11 చోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఉండడం, నిత్యం రెండు సార్లు రోడ్లు, వీధులను శుభ్రం చేయడంతోనే వికారాబాద్‌కు స్వచ్ఛతలో ప్రత్యేక స్థానం దక్కింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్, ఆమనగల్లు , ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, బడంగ్‌పేట, జల్పల్లి , శంషాబాద్, మణికొండ, నార్సింగి ఓడీఎఫ్ ప్లస్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ అవార్డులను ఈ నెల 20న రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.
కేంద్ర బృందం మున్సిపాలిటీల పరిధిలో పర్యటించి పూర్తిస్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఓడీఎఫ్+, ఓడీఎఫ్++ జాబితాలు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ప్రకారం వివిధ కార్యక్రమాలవారీగా మార్కులు ఇచ్చి ఎంపిక చేస్తారు. ప్రధానంగా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్, వాటి పరిసరాలు శుభ్రంగా ఉండడం, ప్రధాన రోడ్లు శుభ్రంగా ఉంచడం, చెరువుల్లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఇతర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అధికారుల బృందం నివేదిక తయారు చేస్తుంది. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జాబితాలను రూపొందించి ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలుండగా.. వికారాబాద్‌కు ఓడీఎఫ్++లో, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీలకు ఓడీఎఫ్+లో చోటు లభించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, బడంగ్‌పేట, జల్పల్లి , శంషాబాద్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ నెల 20న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ఆయా మున్సిపాలిటీల ప్రతినిధులు హాజరు కానుండగా.. వారికి రాష్ట్రపతి అవార్డులు అందజేయనున్నారు.
స్వచ్ఛ పట్టణంగా వికారాబాద్
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 13467 ఇండ్లు ఉండగా.. 110 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ చేపట్టారు. వీటితోపాటు పట్టణానికి రోజువారీగా వివిధ పనుల కోసం వచ్చేవారు, వీధి వ్యాపారులు ఇతరుల కోసం పట్టణంలో 11 స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ప్రధాన రోడ్లను రోజుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో శుభ్రం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 80 శాతం వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కొత్తగా మున్సిపాలిటీలో కలిపిన గ్రామపంచాయతీలు మినహా మిగతా ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నది. పట్టణ పరిధిలోని శివారెడ్డిపేట్, కొంపల్లి చెరువుల్లో ఎప్పటికపుడు చెత్తను తొలగిస్తున్నా. పట్టణంలో మురికినీటి శుద్ధి ప్లాంటును 8 ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. మురికినీరంతా శుద్ధి చేసి, ఆ నీటిని గోల్ఫ్ కోర్టు వారికి సరఫరా చేస్తున్నారు. మల వ్యర్థ శుద్ధి కేంద్రం(ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019-20లో వికారాబాద్ మున్సిపాలిటీ ఓడీఎఫ్+లో ఉండగా ఈసారి ఓడీఎఫ్++లో చోటుదక్కింది.
ఓడీఎఫ్+ జాబితాలో తాండూరు, కొడంగల్
తాండూరు మున్సిపాలిటీలో 16309 ఇండ్లుండగా 100శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో ఓడీఎఫ్ సాధించింది. మున్సిపల్ పరిధిలో 7 స్థలాల్లో టాయిలెట్లు నిర్మించారు. ఎఫ్ఎస్టీపీ ఏర్పాటుకు ఇటీవలే స్థలం ఎంపిక పూర్తయింది. ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచుతున్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో 3672 ఇండ్లుండగా 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. పట్టణంలో 2 స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం సైతం చేపడుతున్నారు. తాండూరు, కొడంగల్‌లో మూడు చెరువుల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. దీంతో ఓడీఎఫ్+ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, బడంగ్‌పేట, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, చెరువులు, కుంటల నీళ్లు కలుషితం కాకుండా చూడడం, 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజీలు తదితర నిర్మాణాలు చేపట్టారు.
అవార్డులకు ఎంపికైన విధానం..
మున్సిపాలిటీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా చెత్త సేకరణ, ప్రత్యేక వాహనాలు, నిత్యం పారిశుధ్య నిర్వహణ పనులు, అవగాహన సదస్సులు, ముండ్ల పొదల తొలగింపు, పాడుబడ్డ బావుల పూడ్చివేత, పాత నివాసాల కూల్చివేత, నీటి కుంటల రక్షణ, చెత్త డంపింగ్ యార్డుల నిర్వహణ, ప్రతి ఇంటికి కచ్చితంగా మరుగుదొడ్డి నిర్మాణం, ఆరుబయట మలవిసర్జన నిషేధం, చెత్త సేకరణ నుంచి సేంద్రియ ఎరువుల తయారీ, ప్రభుత్వ నిషేధిత ప్లాస్టిక్ విక్రయాల అమ్మకాలకు అడ్డుకట్ట వేయడం, చెరువులు, కుంటలు, కోనేర్లకు కలుషిత నీరు పోకుండా చర్యలు తీసుకోవడం, సురక్షిత మంచినీటి సరఫరా, హరితహారం వంటి కార్యక్రమాలను చేపట్టడంతో మున్సిపాలిటీలు అవార్డులు దక్కించుకున్నాయి.