
సిద్దిపేట అర్బన్, నవంబర్ 13 : వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు హ్యాబిటేషన్స్, గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి శనివారం బీ.ఆర్.కే.ఆర్ భవన్ నుంచి జిల్లా డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లతో కలిసి వైద్య ఆరోగ్యశాఖపై తొలి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవసరమైతే ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. పీహెచ్సీలో ఇక నుంచి 9 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా విధులు నిర్వహించాలని, లేనిచో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక నుంచి గ్రామాల్లో ఆశకార్యకర్తల నుంచి వైద్య అధికారుల వరకు అన్ని కార్యక్రమాలపై కలెక్టర్, డీఎంహెచ్వోలు ప్రతి వారం సమీక్షించాలని సూచించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పై బడిన ప్రజలు 2 కోట్ల 77 లక్షల మంది ఉన్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 43 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. అందులో 2 కోట్ల 35 లక్షల మందికి మొదటి డోస్, కోటీ 8లక్షల మందికి రెండోడోస్ ఇచ్చినట్లు తెలిపారు. అర్హత కలిగిన 18.66 లక్షల మంది రెండోడోస్ వేసుకునేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాలకు రావాల్సి ఉన్నదని, రాష్ట్రంలో అర్హత కలిగినట్లు గుర్తించిన వారిలో 85శాతం మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు. వైద్యాధికారులు, డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, పీవోలు అందరూ వారి వారి ప్రాంత్రాల్లో పీహెచ్‌సీలను సందర్శించి ఎప్పటికప్పుడూ అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
నిబద్ధతతో పని చేయాలి..
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో 12వ ర్యాంక్‌లో ఉన్నదని, మొదటి డోస్ 80శాతం, రెండోడోస్ 38 శాతం మాత్రమే కవరేజ్ అయ్యిందని, వందకు వందశాతం దిశగా ఆశ నుంచి మొదలుకొని అధికారుల వరకు నిబద్ధతతో పని చేయాలన్నారు. ఇక నుంచి తాను కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాను సందర్శించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ దవాఖానలు, ఏరియా దవాఖాన, మెడికల్ కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసేందుకు కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకొని వంద శాతం వ్యాక్సినేషన్ అయ్యేటట్టుగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను కోరారు. ప్రభుత్వ దవాఖానలో వైద్యులు సమయపాలన పాటిస్తూ అన్ని రకాల శస్త్ర చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ జాబితాలో 946 వ్యాధులకు గానూ వైద్య చికిత్సలు అందజేస్తున్నారని, ఆయుష్మాన్ భారత్ కింద మరో 646 వ్యాధులను, మొత్తం కలిపి 1592 వ్యాధులకు ప్రభుత్వ దవాఖానలల్లో వైద్య చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట జిల్లా నుంచి ట్రెయినీ కలెక్టర్ ప్రఫుల్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్.మనోహర్, డీసీఎచ్ఎస్ డాక్టర్.మహేశ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.కిషోర్ కుమార్, ఆర్ఎంవో డాక్టర్.హేమలత, డీపీవో కౌసల్యాదేవి, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.