రైతులకు ఉరితాళ్లు పంపుతున్న మోడీ
అంబానీ, అదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం
ధాన్యంపై కేంద్రం వైఖరి చెప్పాలి
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతుల పట్ల విపక్ష చూపుతూ రైతాంగానికి నరేంద్రమోడీ ఉరితాళ్లు పంపుతున్నాడని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. యాసంగి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యంపై కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో రైతులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ధర్నాకు దిగి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పంజాబ్ ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రజల ఆస్తులు అమ్మే కేంద్రానికి రైతుల పంటల కొనడానికి చేతకాదా..అని ఎద్దేవా చేశారు. కేంద్రానికి అమ్మడం తప్పా కొనడం చేతకాదా అని విమర్శించారు. ఆస్తులు అమ్మడానికి కేంద్రంలో మీ పాలన అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగంలో ఇప్పుడిప్పుడే సంతోషం వెల్లివిరుస్తున్నదని, ఏడేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం కష్టాలు మరిచిపోయి మంచి రోజులు చూస్తున్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ దేశంలో ఇతర రాష్ర్టాల అభివృద్ధిని దాటి ప్రగతి బాట పట్టిందని గుర్తు చేశారు.
తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే ఆత్మైస్థెర్యంతో ముందడుగు వేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు లేవన్నారు. 1967నుంచి కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి పంటలు కొనుగోలు చేస్తున్నదన్నారు. ఎఫ్‌సీఐ ద్వారా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పంటలు సేకరిస్తున్నదన్నారు. దేశంలో మద్దతు ధర దక్కని పంటలనుకొనుగోలు చేసి ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసి ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్రానిదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవో..రాజ్యంగాం ఏమి చెబుతుందో తెలియని అనామకులు తెలంగాణ ప్రభుత్వం మీద అవాకులు,చవాకులు పేలుతున్నారని చురకలు అంటించారు. రెండు రూపాయల బియ్యం కోసం ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన పేదరికం తెలంగాణదని అన్నారు. వేగంగా ఎదిగివస్తున్న తెలంగాణను ప్రోత్సహించకుండా నరేంద్ర మోడీ వివక్ష చూయిస్తున్నారని మండిపడ్డారు. అప్పుల కోసం అంజమోన్ బ్యాంకులు ఇండ్లలోని వస్తువులు జప్తు చేసే దుస్థితి నుంచి కేసీఆర్ రైతుబంధు పైసలు పడ్డయి, పొలం పనులు పెడుదామనే స్థాయికి రైతులు వచ్చారన్నారు. పంజాబ్‌కు మించి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతాంగం పండించారని గుర్తుచేశారు. వేగంగా ఎదుగుతున్న తెలంగాణకు అండగా నిలుస్తారా..ఓర్వలేక కాళ్లలో కట్టెలుపెడతారా? కేంద్రం నిర్ణయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో లక్షలాది మంది రైతులు ఉద్యమిస్తూ 600 మంది రైతులు అసువులు బాసారాని విమర్శించారు. కేంద్రం ఒప్పంద సేద్యంతో రైతుల నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పంట ధరకు, సరుకులు కొనే ధరల్లో తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న సాకుతో దోపిడీకి కేంద్రం కొత్త చట్టాల ద్వారా బాటలు వేసిందన్నారు. మార్కెటింగ్ వ్యవస్థ నిర్విర్యానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలో బలమైన ఆహార రంగాన్ని కార్పొరేట్ల పరం చేసే కుట్రనే కొత్త వ్యవసాయ చట్టాలని వెల్లడించారు. రైతుల కోసం ఇన్నాళ్లు మౌనంగా భరించామని, ఇక చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
గుట్టల మీదికి, గట్ల మీదికి సాగునీళ్లు అందించి లిఫ్టులు పెట్టించి రైతులకు చేయూత నందించామన్నారు. బాధ్యతలేని వ్యక్తులు అడ్డగోలుగా రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. యాసంగి వడ్లన్నీ బాయిల్డ్‌రైస్ కోసమేనని సామాన్య రైతులకు తెలిసిన విషయం బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు తెలియకపోవడం విడ్డూరమన్నారు. బీజేపీకీ నూకలు చెల్లడం ఖాయమన్నారు. బీజేపీ పాలనలో నకిలీ విత్తనాల తయారీదారులకు, డ్రగ్స్ మాఫీయాకు, బ్యాంకులకు రుణాలు ఎగవేత వారికి గుజరాత్ అడ్డాగా మారిందన్నారు. ఎగ్గొట్టిన అప్పులు మాఫీ చేసిన కేంద్రం రైతుల ధాన్యం కొనడానికి నిరాకరిస్తుందని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టే అన్నదాతలకు కేంద్రం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం విధానాలు చూసి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేసిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ మహేశ్‌రెడ్డి, వనపర్తి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెంకట్రావు, వనపర్తి పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, రైతుబంధు సమితి గోపాల్పేట్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య యాదవ్, వనపర్తి మండలాధ్యక్షుడు మాణిక్యం, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు కోళ్ల వెంకటేశ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.