అలంపూర్ /ఉండవెల్లి, నవంబర్ 12 : తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్నా వారికి తెలియదా తెలంగాణ ప్రాంత రైతుల గోస అని ఎమ్మెల్యే అబ్రహం ప్రశ్నించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో సీఎం కే సీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి రైతులు, పార్టీ నాయకులు క్యాంప్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలతో జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. శాంతియుతంగా 44వ జాతీయ రహదారిపై జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో 29రాష్ర్టాల్లో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించేందుకు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి, సాగునీరు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. దీంతో రాష్ట్రంలో సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో రైతులు భారీగా వరి పంటను సాగుచేసినట్లు తెలిపారు. పలు రాష్ర్టాల్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభు త్వం తెలంగాణ రైతుల పంటను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి జిల్లా, తాలూకా, మండలస్థాయిల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే హెచ్చరించారు.
తెలంగాణ రైతులకు
సున్నం పెడుతున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులకు సున్నం పెడుతుందని జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తుందన్నారు. తె లంగాణ రైతులను రాజులుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, బ్యాంక్ ద్వారా పంట రుణాలు, విత్తన సబ్సి డీ, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని జెడ్పీ చైర్పర్సన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.కార్యక్రమంలో అలంపూర్, అయి జ, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.