
రైతు బంధు పథకంలో ఎనిమిదో విడుత అందజేస్తున్న పెట్టుబడి సాయం గురువారంతో ముగిసింది. గత నెల 28వ తేదీ నుంచి 24 రోజులపాటు నిరాటంకంగా ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ వచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ విడుతలో 9.56లక్షల మంది రైతులకు రూ.1203.76కోట్లను అందజేశారు. దీంతో మొత్తం ఎనిమిది విడుతల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రైతులకు రూ.7,930 కోట్లు పెట్టుబడి సాయంగా అందింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ఏకైక లక్ష్యంగా కులం, మతం, ధనిక, బీద, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండి వివరాలు అందజేసిన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందించారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి20(నమస్తే తెలంగాణ): రైతుకు వ్యవసాయంలో పెట్టుబడికి భరోసా నిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేలు అందజేస్తూ వస్తున్నారు. ఈ యాసంగిలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేశారు. డిసెంబర్ 28 నుంచి రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. తక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతుల నుంచి దశలవారీగా డబ్బును జమ చేశారు. గురువారంతో పట్టాదారు పాస్ పుస్తకం ఉండి వివరాలు అందజేసిన ప్రతి రైతుకు నగదు పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం ఎనిమిదో విడుతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 4.93 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి వారికి రూ.616.21 కోట్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వివరాలు అందించిన మేరకు మొత్తం 4,69,696 మందికి 601.74 కోట్లు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లాలో 2.70 లక్షల మంది అర్హులుగా గుర్తించగా అందులో 2,61,079 మంది రైతులు వివరాలు అందజేశారు. వీరికి మొత్తం రూ.314 కోట్లకు గాను రూ.309.28 కోట్లు జమ చేశారు. యాదాద్రి జిల్లాలో 2.43 లక్షల మంది అర్హులు ఉన్నారని భావించగా అందులో 2,25,956 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. దాంతో రూ.302 కోట్ల లక్ష్యానికి రూ.292.74 కోట్లు అందించారు. కొందరు రైతులు వివిధ కారణాలతో బ్యాంకు ఖాతాల్లో సమస్యలు, ఎన్ఆర్ఐలు, ఇంకొందరు తమ వివరాలు అందజేసేందుకు సుముఖంగా లేకపోవడంతో పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు.
మొత్తం రూ.7,930కోట్లు.
రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎనిమిది విడుతల్లో కలిపి మొత్తం రూ.7,930 కోట్లు రైతులకు నగదు రూపంలో అందాయి. ఇందులో ప్రతీ రూపాయి నేరుగా రైతుకే చెందడం విశేషం. గతంలో ఏ పథకంలో అయినా దళారుల ప్రమేయం లేదా వివిధ రూపాల్లో లంచాలు ఇతరత్రా కారణాలతో 10 నుంచి 20శాతం సాయం దారి మళ్లేది. కానీ ఇందులో ఎవరికీ సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేస్తూ వస్తున్నారు. రైతు తన వివరాలను వ్యవసాయశాఖకు అందజేస్తే వారు ఆ వివరాలను పోర్టల్లోకి అప్లోడ్ చేయగా ఆ వివరాల మేరకే పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి చేరుతుంది. మొత్తం 8 విడుతల్లో నల్లగొండ జిల్లాలో రూ.4,170 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.1,833 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1,927 కోట్లు రైతులకు చేరాయి. ఈ నగదుతో కొత్తగా ఎంతో మంది రైతులు వ్యవసాయంలోకి దిగారు. గతంలో భూములు వదిలి వెళ్లిన రైతులు సైతం తిరిగి వచ్చి పంటల సాగులో బిజీ అయ్యారు. 2014కు పూర్వం ఉమ్మడి జిల్లాలో 13 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు కాగా ప్రస్తుతం 21లక్షల ఎకరాలకు సాగుభూమి పెరిగిందంటేనే వ్యవసాయంలో వచ్చిన సమూల మార్పులను అర్థం చేసుకోవచ్చు.