శ్రీశైలం, అక్టోబర్ 11 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరుగుతున్నది. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నది. జూరాలకు లక్ష క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో నమోదు కావడంతో సోమవారం 16గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద చేరుతుండడంతో నాలుగు గేట్ల ద్వారా సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. జూరాల, శ్రీశైలం పవర్‌హౌస్‌లోని అన్ని యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తున్నది. సోమవారం సాయంత్రం నాలుగు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని సాగర్‌కు విడుదల చేశారు. జూరాల నుంచి 1,04,370 క్యూసెక్కులు, సుంకేసుల నుం చి 46,277, హంద్రి నుంచి 117.. మొ త్తం 1,50,764 క్యూసెక్కులు విడుదల చే శారు. కాగా, సాయంత్రం ఆరు గంటలకు రిజర్వాయర్‌కు 1,82,876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నాలుగు గేట్ల నుంచి 1,11,932 క్యూసెక్కులు, ఎడుమ, కుడి గ ట్టు విద్యుదుత్పత్తి ద్వారా 66,383 (మొ త్తం 1,78,315) క్యూసెక్కులు దిగువన ఉ న్న సాగర్ రిజర్వాయర్‌కు వదిలారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 884.80 అడుగుల వద్ద 214.8450 టీఎంసీలు ఉన్నాయి.
జూరాలలో 16 గేట్లు ఎత్తివేత..
ఆత్మకూరు, అక్టోబర్ 11 : జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్న ది. సోమవారం రాత్రి 99,525 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 16 గేట్లు ఎత్తి 64,992 క్యూసెక్కులు వదిలారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాలువకు 640, కుడి కాలువకు 730, స మాంతర కాలువకు 150, భీమా-2కు 750, విద్యుదుత్పత్తికి 38,803 క్యూసెక్కు లు విడుదల చేశారు. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్ల నుంచి 4.58 మి.యూ, దిగువ జూరాల జలవిద్యు త్ కేంద్రంలో ఆరు యూనిట్ల నుంచి 4.15 మి.యూ విద్యుదుత్పత్తి చేశారు. దిగువ జూరాలలో 300 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిన నేపథ్యంలో విద్యుత్ ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. ఒకరికొకరు అ భినందనలు తెలిపారు. ప్రాజుక్టు పూర్తి స్థా యి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్ర స్తుతం 8.551 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి 1,06,156 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
పూర్తి స్థాయిలో టీబీ డ్యాం..
అయిజ, అక్టోబర్ 11 : ఎగువన కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతున్నది సోమవారం ఇన్‌ఫ్లో 14,157 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 13,757 క్యూసెక్కులు నమోదైంది. డ్యాం లో 100.855 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు 58,358 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 57,900 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 11.4 అడుగుల మేర నీటి మట్టం ఉండగా, ప్రధాన కాల్వకు 458 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.