సిబ్బందికి, 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు టీకా
కలెక్టర్ ఆదేశాలతో 100 శాతం పూర్తి చేసేందుకు కసరత్తు
ప్రతి ఒక్కరూ వేసుకోవాలి : డీఐఈవో శైలజ
మంచిర్యాల, సెప్టెంబర్ 11, నమస్తే తెలంగాణ : కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలను తెరిచిన సర్కారు, సిబ్బందికి, విద్యార్థులకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రక్రియ పూర్తి చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 488 సిబ్బందికిగాను 478 మంది, ఇక 942 (18ఏళ్లు నిండినవారు) మంది విద్యార్థులకుగాను 85 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2,497 మంది విద్యార్థులకుగాను 907 మంది టీకా వేయించుకున్నారు. వీలైనంత త్వరగా 100 శాతం ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ భారతీహోళికేరి ఆదేశాలు జారీ చేయగా, యంత్రాంగం పిల్లల్లో మనోధైర్యంనింపుతూ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం విద్యాసంస్థలను తెరిచింది. ఓ వైపు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధనతో పాటు మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వడివడిగా కొనసాగిస్తున్నది. టీకాలు తీసుకున్న వారి సంఖ్య పెరిగితే వైరస్ వ్యాప్తి నుంచి ముప్పు తక్కువగా ఉంటుందని 18 ఏండ్లు పైబడిన విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నది. త్వరలోనే 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్, సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయగా, విద్యార్థులు, పేరెంట్స్కు ప్రిన్సిపాళ్లు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అపోహలు వీడి, నిర్మొహమాటంగా, నిర్భయంగా టీకా తీసుకోవాలని విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు టీకాలు వేస్తున్నారు. తమ గ్రామాలకు అందుబాటులో ఉన్న మండలకేంద్రాల్లోనూ వ్యాక్సిన్ వేసుకోవచ్చని విద్యార్థులకు సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనల మధ్య ప్రత్యక్ష బోధన కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మొత్తం 488 మంది సిబ్బంది ఉండగా, 478 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన పది మందికి ఇటీవల కొవిడ్ రాగా, నెలలోపు వారు కూడా టీకా తీసుకోనున్నారని డీఐఈవో శైలజ పేర్కొన్నారు. మొత్తం 57 కళాశాలల్లోనూ 12,140 మంది విద్యార్థులుండగా, ఇందులో 18 ఏండ్లు పైబడిన వారు 942 మంది ఉన్నారు. వీరిలో 85 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మిగితా వారు తీసుకునేలా విద్యార్థులు, పేరెంట్స్కు అవగాహన కల్పిస్తున్నామని డీఐఈవో తెలిపారు. జిల్లాలో మొత్తం ఐదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా, ఇందులో 2,497 మంది విద్యార్థులు ఉన్నారు. 907 మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా, మిగితా వారు కూడా త్వరలో తీసుకునేలా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్లు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
జూనియర్ కళాశాలల్లో వ్యాక్సినేషన్..
మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరిధిలో 10 ప్రభుత్వ, 4 బీసీ సంక్షేమం, 6 సాంఘిక సంక్షేమం, 1 టీఎస్ఆర్జేసీ, 3 తెలంగాణ మైనార్టీ కళాశాలలు, 6 కేజీబీవీ, 5మోడల్ పాఠశాలలు/కళాశాలలు, 1 ఇన్సెంటివ్, 17 ప్రైవేటు అన్ ఎయిడెడ్, 4 ప్రైవేటు ఒకేషనల్ జూనియర్ కళాశాలలు జిల్లా ఇంటర్మీడియట్ నియంత్రణలో పనిచేస్తున్నాయి. 2021-22 విద్యా సంవత్సరంలో 57 జూనియర్ కళాశాలల్లో మొత్తం 12,140 మంది విద్యార్థులు ఉన్నారు. కొవిడ్ 19 మహమ్మారి కారణంగా 2021-22 విద్యాసంవత్సరంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రత్యక్ష తరగతులు జరుగలేదు. ప్రభుత్వ కళాశాలల్లో 143 మంది సిబ్బంది ఉండగా, 139 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. మిగిలిన నలుగురు కొవిడ్ బాధితులు కాగా, వీరు త్వరలో వేసుకోనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో సిబ్బంది 345 కాగా, ఇందులో 339 మంది టీకా వేసుకున్నారు. మిగిలిన ఆరుగురికి కొవిడ్ రావడంతో నెలపాటు సమయం ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం విద్యార్థులు 4,956 కాగా, ఇందులో 18 ఏండ్లు పైబడినవారు 587 మంది ఉన్నారు. 62 మంది టీకా తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు 7,184 మంది కాగా, ఇందులో 18 ఏండ్లు పైబడిన వారు 355 మంది ఉన్నారు. కాగా, 23 మంది టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కోసం విద్యార్థులకు డీఐఈవో, ప్రిన్సిపాల్లు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీలు, సమీప పీహెచ్సీల్లో టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలకేంద్రాల్లో పది వ్యాక్సినేషన్ కేంద్రాలు కొనసాగుతున్నాయని, కళాశాలల్లోనూ టీకా వేస్తున్నారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) శైలజ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా సమాచారం అందించామని, కొంతమంది పేరెంట్స్కు అపోహలు ఉన్నాయని ఆమె తెలిపారు. విద్యార్థులంతా ఎలాంటి అపోహలు, భయభ్రాంతులకు గురికావద్దని, తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకొని, ఆరోగ్యంగా ఉండాలని ఆమె సూచించారు.
డిగ్రీ కళాశాలల్లో..
జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేటలో ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు, మంచిర్యాల జిల్లాకేంద్రంలో టీఎస్డబ్ల్యూఆర్డీసీ (మహిళలు) ఉన్నాయి. ఇందులో చెన్నూర్ డిగ్రీ కళాశాలలో 298 మంది విద్యార్థులకు గాను 39 మంది టీకా తీసుకున్నారు. మంచిర్యాల జీడీసీలో 347 మందికి, 210 మంది, లక్షెట్టిపేట జీడీసీలో 715 మంది విద్యార్థులకు 214 మంది, బెల్లంపల్లిలో జీడీసీలో 431 మందికి 56 మంది, మంచిర్యాల టీఎస్డబ్ల్యూఆర్డీసీ (వుమెన్)లో 706 మందికి 388 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా ఐదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,497 మంది విద్యార్థులకు గాను, 907 మంది టీకా వేయించుకున్నారు. మిగితా వారికి త్వరలో పూర్తి చేయనున్నట్లు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.వి.చక్రపాణి తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని, 18 ఏండ్లు పైబడిన విద్యార్థులు అందుబాటులో ఉన్న పీహెచ్సీ కేంద్రాల్లోనూ టీకా తీసుకోవాలని ఆయన కోరారు.
టీకా తీసుకోవాలి.. ఆరోగ్యంగా ఉండాలి..
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కలిపి మొత్తం 488 మంది సిబ్బం ది ఉన్నారు. ఇందులో 478 మంది టీ కా తీసుకున్నారు. మిగితా వారికి కొవిడ్ రావడంతో త్వరలో తీసుకోనున్నారు. ప్ర తి విద్యార్థి కూడా టీకా తీసుకునేలా స మాచారం అందించాం. కొంతమంది పేరెంట్స్కు అపోహ లు ఉన్నాయి. వ్యాక్సినేషన్ కోసం వారిలో అవగాహన కల్పిస్తున్నాం. కాలేజీలు, సమీప పీహెచ్సీల్లో టీకాలు తీసుకునే లా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులంతా ఎలాం టి అపోహలు, భయభ్రాంతులకు గురికావద్దు. తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి.
విద్యార్థుల సౌకర్యార్థం..
ఉన్నత విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల సౌకర్యా ర్థం వైద్య సిబ్బంది సహకారంతో కళాశాలలో మూడు రోజుల పాటు కోవిడ్ వ్యా క్సిన్ కార్యక్రమం నిర్వహించాం. విద్యార్థులకు సౌకర్యంగా ఉండాలని వందశాతం వ్యాక్సినేషన్ కోసం కాలేజీలోనే టీకాల ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. డీఎంహెచ్వో సుబ్బరాయుడు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని కొనసాగించారు.
సైడ్ ఎఫెక్ట్స్ లేవు..
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాక్సినేషన్ శిబిరంలో నేను పాల్గొన్నా ను. టీకా తీసుకున్నాక నాకు స్వ ల్ప జ్వ రం వచ్చింది. తగ్గిపోయింది. ఇత ర ఎ లాంటి ఇబ్బంది కూడా కాలేదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా లే వు. టీకాతో మనతో పాటు చుట్టు పక్కల వారి ఆరోగ్యాన్ని కూ డా కాపాడుకోవచ్చు. కొవిడ్ రహిత జిల్లాకు సహకరిద్దాం. శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు.
కృతజ్ఞతలు..
కరోనా తరిమికొట్టేందుకు అందరం సహకరిద్దాం. వ్యాక్సినేషన్ తీసుకున్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. టీకా తీసుకోవడంతో కరోనా బారి నుంచి రక్షించుకోవచ్చు. వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసిన వైద్య సిబ్బందికి, కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందికి కృతజ్ఞతలు.