మేడారంలో పనుల కోసం 21 శాఖలకు నిధులు విడుదల
రూ.75కోట్లతో 38 సెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తాం
జంపన్నవాగుకు ఇరువైపులాదుస్తులు మార్చుకునే గదులు
కొత్తగా వాటర్ ట్యాంకులు నిర్మిస్తాం
సమీక్షలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య
పోడు పట్టాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచన
ములుగుటౌన్, నవంబర్ 10 : మేడారం మహాజాతరకు మహోత్తర ఏర్పాట్లు చేయనున్నామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంతో జాతర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందన్నారు. రహదారులు, భవనాలు శాఖకు రూ.13 కోట్లు, పంచాయితీరాజ్ శాఖకు రూ.4కోట్లు, జలవనరుల శాఖకు రూ.6 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.4.50 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖకు రూ.13.50 కోట్లు, జిల్లా పంచాయతీ అధికారికి రూ.4 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.10 లక్షలు, మత్యశాఖకు రూ.15 లక్షలు, పశు సంవర్ధక శాఖకు రూ. 20 లక్షలు, గిరిజనాభివృద్ధి శాఖకు రూ.2.50 కోట్లు, పౌర సంబంధాల శాఖకు రూ. 20 లక్షలు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. కోటీ, పోలీస్ శాఖకు రూ.11 కోట్లు, ఫారెస్ట్ శాఖకు రూ.20 లక్షలు, ఐసీడీఎస్‌కు రూ.10 లక్షలు, రెవెన్యూ శాఖకు రూ. 4.40 కోట్లు, ఎండోమెంట్‌కు రూ.3 కోట్లు, ఎక్సైజ్ శాఖకు రూ.15 లక్షలు, టూరిజం శాఖకు రూ.50 లక్షలు, విద్యుత్ శాఖకు రూ.4 కోట్లు, టీఎస్ఆర్టీసీ రూ.2.50 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రూ.1.8 కోట్లతో మేడారం బస్టాండ్, హరిత, ఇంగ్లిష్ మీడియం పాఠశాల వద్ద కొత్తగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన సంక్షేమం కింద కేటాయించిన నిధులతో మేడారం ఇంగ్లిష్ మీడియం, నార్లాపూర్ పాఠశాలలో డైనింగ్ హాళ్లు, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, భక్తుల వసతి కోసం ఐదు షెడ్లను ఏరాటు చేయనున్నట్లు తెలిపారు. నార్లాపూర్, పూనుగొండ్ల, బయ్యక్కపేట, దొడ్ల దేవాలయాలకు కూడా శాశ్వత ప్రాతిపాదికన పనులు చేపడుతామన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ గత సంవత్సరంలో వచ్చిన సమస్యలు పునరావృతం కావొద్దని ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జంపన్నవాగుకు ఇరువైపులా దస్తులు మార్చుకోవడానికి శాశ్వత గదులు ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 10 వరకు పనులు పూర్తి చేస్తామన్నారు.
పోడు చేసుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి
2005 డిసెంబర్ వరకు పోడు చేసుకున్న అందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు సమర్పణలో భూమికి సంబంధించిన ఏవైనా రెండు ఆధారాలతో క్లెయిమ్స్ చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక ఉంటుందని అన్నారు. దరఖాస్తు ఫారానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కొందరు రైతలు తమ దగ్గర 1960కి సంబంధించిన శిస్తులు ఉన్నాయి అవి ఆధారంగా జత చేయవచ్చా అని అడిగారు. ఆ పత్రాలతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.